‘పుర’పోరుపై నేడు స్పష్టత!

29 Oct, 2019 03:05 IST|Sakshi

కీలక నిర్ణయం తీసుకోనున్న ఈసీ

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, కమిషనర్లతో సమావేశం

వచ్చే వారం నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: పురపోరుపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక నిర్ణ యం తీసుకోనుంది. ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల నగారా ఎప్పుడు మోగిస్తారనే దానిపై స్పష్టతనిచ్చే అవకాశముంది. నవంబర్‌లో ఎన్నికలు జరపాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కార్‌.. న్యాయపరమైన చిక్కులు వీగిపోయేలా పావులు కదుపుతోంది. పురపాలక సంఘాల ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 78 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిలుపు దల చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం విధించిన స్టే ఉత్తర్వులు తొలిగిపోయేలా 3 రోజల క్రితం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఈ కేసులో కూడా తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఎన్నికల నిర్వహించడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది.

ఏ క్షణమైనా నోటిఫికేషన్‌.. 
గత శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితానే పురపోరులోను వాడనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌ బూత్‌ల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఇతరత్రా ఏర్పాట్లపై కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్షించనుంది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులిచ్చే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే.. ఎస్‌ఈసీ ఈ నెలాఖరులోగా పురభేరి మోగించనుంది. కాగా, ప్రభుత్వం మాత్రం గురువారం న్యాయస్థానం విచారించే కేసుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తుది అడుగు వేయనుంది. ఒకవేళ ఆ రోజే తీర్పు వెలువడితే.. మూడు రోజుల్లో రిజర్వేషన్ల క్రతువును పూర్తి చేసి.. ఈసీకి జాబితాను ఇవ్వనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ ప్రకటించనుంది.  కాగా, మీర్‌పేట నగర పాలక సంస్థ ఎన్నికలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

>
మరిన్ని వార్తలు