నేతలు బడా.. ఖర్చులు చోటా

13 Jan, 2019 03:27 IST|Sakshi

ఎన్నికల వ్యయం పిసరంతే

కేసీఆర్‌ ఎన్నికల వ్యయంరూ.6.53 లక్షలే

రూ.7.53 లక్షల వ్యయంచూపిన కేటీఆర్‌ 

రూ.17 లక్షలు ఖర్చు చేసిన ఉత్తమ్‌

అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్నివిడుదల చేసిన ఈసీ

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కొండంత వ్యయం చేసిన నేతలు.. ఎన్నికల వ్యయ లెక్కలకు వచ్చేసరికి కొంతే చూపించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవిడిగా డబ్బులు, మద్యాన్ని పంచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నేతలు తాము చాలా తక్కువ ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు.  ఈ మేరకు ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించారు. అభ్యర్థుల రోజువారీ ఖర్చును పరిశీలించడానికి వీలుగా జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవో) జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వినియోగించే వస్తువులు, పదార్థాల ధరలను సేకరించి తయారు చేసిన ధరల పట్టికలతో పొంతన లేకుండా అభ్యర్థులు లెక్కలు సమర్పించారు.

ఉదాహరణకు కారు రోజువారీ అద్దె, నిర్వహణ వ్యయం కేవలం రూ.800 మాత్రమే. 30 కార్లు/ఇతర వాహనాలను 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో వినియోగించినందుకు కేవలం రూ.4.3 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని ఓ మాజీమంత్రి లెక్కలు వేశారు. ఎన్నికల వ్యయపరిశీలకులు సైతం పెద్దగా అభ్యంతరం చెప్పకుండానే ఇలాంటి లెక్కలను ఆమోదించడం గమనార్హం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన వ్యయలెక్కలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం తన వెబ్‌సైట్‌ ద్వారా బహిర్గతం చేసింది. కొందరు ముఖ్య నేతలు సమర్పించిన ఎన్నికల వ్యయలెక్కలు ఇలా ఉన్నాయి.  

రేవంత్‌ ఖర్చు రూ.7.4 లక్షలే! 
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అత్యధిక ధనప్రవాహం జరిగిన నియోజకవర్గాల్లో ఒకటిగా కొడంగల్‌ పేరు సంపాదించింది. ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రూ.7,44,280 మాత్రమే ఖర్చుచేసినట్లు నివేదించారు. ఆయనపై గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రూ.19,44,503 ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పించారు.  

లెక్కల్లో ‘ఉత్తమ్‌’ 
హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.17,06,473 ఎన్నికల వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. ఎన్నికల ఖర్చుల కోసం రూ.15 లక్షల విరాళాలు, రూ.5 లక్షల చేబదులు అప్పు తీసుకున్నట్లు నివేదించారు.  

అక్బరుద్దీన్‌ రూ.12 లక్షలు.. 
ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల్లో రూ.12,97,005 ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. అందులో రూ.6,55,859 కేవలం బహిరంగసభలు, ర్యాలీలు, యాత్రలు నిర్వహించడానికి ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు.  నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరిగ్గా ఎన్నికల సంఘం అనుమతించిన గరిష్ట వ్యయపరిమితి రూ.28 లక్షలను ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు నివేదించడం గమనార్హం.  మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ రూ.15,42,978 వ్యయమైనట్లు చూపించారు. మాజీ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి రూ.16,10,464 ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

కేసీఆర్‌ రూ.6.53 లక్షలు..కేటీఆర్‌ రూ.7.53 లక్షలే  
ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ నుంచి పోటీ చేసేందుకు అయిన ఖర్చు  రూ.6,53,639. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు సిరిసిల్ల నుంచి పోటీ చేసేందుకు రూ.7,56,372 ఖర్చు చేశారు.

ఎన్నికల వ్యయం ఎందుకంటే? 
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతోపాటు పోటీ చేసేందుకు అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు పెట్టవచ్చని పరిమితి పెట్టింది. నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు పెట్టిన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు రాసుకుని చూపెట్టాల్సి ఉంటుంది.

అభ్యర్థి తన ఎన్నికల ఖర్చు వివరాలను ఫలితాల ప్రకటన అనంతరం 30 రోజుల్లోగా నిర్దిష్ట పద్ధతిలో సమర్పించకపోయినా లేదా అసలు ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వడంలో విఫలమైనా, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 10ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనుంది. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించడంలో విఫలమైన 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం ఈ అనర్హతను ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు