పరీక్షల వేళ.. ఎన్నికల గోల

14 Dec, 2018 11:41 IST|Sakshi
ఓ పాఠశాలలో గ్రూప్‌గా చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు 

అడుగడుగునా అవాంతరాలు.. ఆరంభంలోనే ఉపాధ్యాయుల బదిలీలు.. అసెంబ్లీ ఎన్నికలు.. తిరిగి పంచాయతీ ఎన్నికల కోసం ప్రారంభమైన సన్నాహాలు.. ఆపై ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు వెAరసి .. విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. మరోవైపు అడ్డంకులను అధిగమించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. అయితే ఇది ఏ మేరకు ఆశించిన ఫలితాలు ఇస్తుందో చూడాల్సిందే. మార్చి 16 నుంచి పదో తరగతి   పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక కథనం.

పాపన్నపేట(మెదక్‌): జిల్లాలో 145 ఉన్నత పాఠశాలలు, 55 వరకు ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 11 వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే గత సంవత్సరం కన్నా మెరుగైన రీతిలో  ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ పాఠశాల ప్రారంభం సమయానికి చాలా పాఠశాలల్లో కేవలం 65 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు చేరాయి. అదే సమయంలో ఉపాధ్యాయుల బదిలీల పర్వం ప్రారంభమైంది. జూన్‌ చివరి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై మూడో వారం వరకు కొనసాగింది. ఆపై బదిలీలలో పొరపాట్లు జరిగాయంటూ, జూలై చివరి వారం వరకు కొన్ని బదిలీ ఉత్తర్వులు విడుదల అవుతూనే వచ్చాయి. ఆపై అసెంబ్లీ రద్దు, ఆపై దసరా సెలవులు, అసెంబ్లీ ఎన్నికల శిక్షణ, నిర్వహణ. ఫలితాల విడుదల తదితర పరిణామాలతో డిసెంబర్‌ నెల రానే వచ్చింది.

కనీసం ఇప్పుడైనా చదువులు పట్టా లెక్కుతాయనుకుంటే పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జిల్లాలో మొదలయ్యాయి. మరో వైపు మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్‌ పరీక్షల నిర్వాహణ కోసం విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల చదువులు ఎలా గాడిన పెట్టాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఎంటని తల్లిదండ్రులు కూడా ఆవేదనకు లోనవుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆటంకం లేకుండా పాఠశాల జరిగిన దాఖలాలు లేవు. పదోతరగతిలో ఫలితాలు రాకపోతే అధికారుల చర్యలుంటాయని ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఇంత ఎన్నికల నడుమ ఈ సంవత్సరం పది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.

యాక్షన్‌ ప్లాన్‌ అమలు
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కలెక్టర్‌ ధర్మారెడ్డి, విద్యాశాఖ అధికారి రవికాంత్‌ ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. నవంబర్‌ 1 నుంచి అన్ని పాఠశాలల్లో పదో తరగతికి ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం స్పెషల్‌ క్లాస్‌లు నడుపుతున్నారు. ప్రతీ రోజు ఒక పాఠ్యాంశాన్ని చదువుకొని, దానిపై విద్యార్థులను గ్రూపులుగా విభజించి, చర్చ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం ఆ ఆంశంపై టెస్ట్‌ నిర్వహిస్తూ శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా బోధనేతర విధులు, ఈ ప్రక్రియకు అవరోధంగా మారుతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం..
పదో తరగతి విద్యార్థుల కో సం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రతి రోజును విలువైనదిగా భావిస్తున్నాం. దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రాక్టీస్‌ టెస్టులు కూడా నిర్వహిస్తాం. తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
–మధుమోహన్, నోడల్‌ అధికారి, మెదక్‌

అడుగడుగునా ఆటంకాలే:
ఈ విద్యా సంవత్సరంలో మా విద్యాబోధనకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారు రాక పోవడంతో విద్యా వలంటీర్లతోనే బోధన కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వాహణ విధుల్లోకి టీచర్లు వెళ్తుండటంతో తరగతులు జరగక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
–వినయ్, పదో తరగతి విద్యార్థి, పాపన్నపేట

మరిన్ని వార్తలు