దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్‌

10 Sep, 2018 01:44 IST|Sakshi

     1,900 మంది దళిత రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ నిర్ణయం

     ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.407.32 కోట్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్‌ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది.  ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 

భూమి ఎక్కడ ?
గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు  పెరిగిపోయాయి.  ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్‌కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది.  ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది.  ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు.  

మరిన్ని వార్తలు