నామినేషన్ల పర్వం షురూ.. 

13 Nov, 2018 12:23 IST|Sakshi
ఎన్నికల కార్యాలయం వద్ద బందోబస్తు   

మొదటి రోజు నామినేషన్లు నిల్‌ 

18 అప్లికేషన్ల అందజేత  

జూనియర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్‌ 

పనులను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి ఖిమ్యానాయక్‌

వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కావడంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసే ప్రక్రియ ఆరంభమైంది. నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంగా అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా డీఆర్వో ఖిమ్యానాయక్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగంతో కసరత్తు ప్రారంభించింది. కార్యాలయం నుంచి 100 మీటర్ల వరకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్‌ అమలు పరుస్తున్నారు. 

గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు వన్‌ప్లస్‌ ఫోర్‌ సభ్యులు, గుర్తింపు పొందని పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు వన్‌ప్లస్‌ టెన్‌ సభ్యులను అనుమతిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి  తెలిపారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట వేయిటింగ్‌ హాల్, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం రాత్రి వరకు ఈవీఎంలు వేములవాడకు చేరుకోనున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 

నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే బ్యాలెట్‌ ప్రచురణ, ఈవీఎంలలో లోడింగ్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. వీటితోపాటు వీవీప్యాట్‌లు సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 1200 మంది సిబ్బంది, 40 బస్సుల ద్వారా ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని 235 బూత్‌లకు పంపించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ పూర్తి కాగానే 235 కేంద్రాల నుంచి నేరుగా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి గురుకుల రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనానికి ఎన్నికల సామాగ్రిని తరలిస్తామని తెలిపారు. డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు అక్కడే నిర్వహిస్తామన్నారు.   

29 మంది సైనికులు  
వేములవాడ నియోజకవర్గంలో 29 మంది సైనికులు ఉన్నారని, వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్‌ పేపర్లు పంపిస్తామని తెలిపారు.  

మొదటిరోజు 18 దరఖాస్తులు అందజేత  
నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్‌కు సంబంధించిన దరఖాస్తులను తీసుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. ఆది శ్రీనివాస్, రమేశ్‌ చెన్నమనేని,  నాగుల విష్ణు, పిట్టల భూమేశ్, చీకోటి వరుణ్‌గుప్తా, నాగుల నరేందర్‌ దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు