మరికొద్ది గంటల్లో!

23 May, 2019 03:15 IST|Sakshi

నేడే వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ షురూ 

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నా రు. నేడు జరగనున్న కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కు మార్‌ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించా రు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ని ర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రా ష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్‌ 11న) పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఉదయం 8 గంటలకు ప్రారంభం 
రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుడు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి ఒక హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది బరిలో ఉన్నందున అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కించనున్నారు. ఒక్కో హాల్‌లో 18 చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలోని మేడ్చల్, ఎల్బీనగర్‌ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు.  

సువిధ యాప్‌లో ఫలితాలు 
తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ (ఈటీపీబీ)లను లెక్కించనున్నారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఈవీఎంల రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి శాసనసభస్థానం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాలను ర్యాండమ్‌ విధానంలో ఎంపిక చేసి, అక్కడ నమోదైన వీవీప్యాట్స్‌ ఓట్లను లెక్కించనున్నారు. సంబంధిత పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్స్‌ ఓట్లను సరిపోల్చి చూస్తారు. ఈవీఎం, వీవీప్యాట్స్‌లలోని ఓట్లలో తేడాలొస్తే వీవీప్యాట్స్‌ స్లిప్పుల కౌంటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్‌ ద్వారా ఫలితాలను రిటర్నింగ్‌ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్‌ (https://results.eci.gov.in) ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించిందని రజత్‌కుమార్‌ తెలిపారు. గురువారం మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. 

రిటర్నింగ్‌ అధికారే కింగ్‌! 
ఓట్ల కౌంటింగ్, రీ–కౌటింగ్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం స్థానిక రిటర్నింగ్‌ అధికారిదేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక రిటర్నింగ్‌ అధికారి ఫలితాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు నిశ్శబ్ద సమయం ఉండనుంది. ఓట్ల లెక్కింపుపై అనుమానాలుంటే ఆ రెండు నిమిషాల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు లిఖితపూర్వకంగా రీ–కౌంటింగ్‌ కోరాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారులు తమ విచక్షణ ఉపయోగించి రీ–కౌంటింగ్‌ జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం ఆ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. 

వీవీప్యాట్స్‌ ఓట్లు కీలకం! 
కొన్ని సందర్భాల్లో వీవీప్యాట్స్‌ ఓట్లు కీలకం కానున్నాయి. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంల మీద ఉండే ‘క్లోజ్‌’మీటను నొక్కడాన్ని ప్రిసైడింగ్‌ అధికారులు మరిచిపోతే, మళ్లీ క్లోజ్‌ మీటను నొక్కే వరకు అలాంటి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం సాధ్యం కాదు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్లను సరిచూసుకున్న తర్వాత క్లోజ్‌ మీటను నొక్కి ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యలో తేడాలుంటే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కాదని వీవీప్యాట్స్‌ స్లిప్పులను లెక్కిస్తారు.

ఇప్పటి వరకు ఎక్కడా ఈవీ ఎం, వీవీప్యాట్స్‌ ఓట్ల మధ్య తేడాలు రాలేదని రజత్‌కుమార్‌ వెల్లడించారు. పోలింగ్‌ రోజు మాక్‌ పోల్‌ లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి డిలీట్‌ చేయడాన్ని పోలింగ్‌ సిబ్బంది మరిచిపోతే, వాస్తవ పోలింగ్‌ ఓట్లతో మాక్‌పోల్‌ ఓట్లు కలిసిపోనున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైతం వీవీప్యాట్స్‌ ఓట్లను పరిగణలోకి తీసుకుంటామని రజత్‌కుమార్‌ వెల్లడించారు. తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల సంఖ్య మార్జిన్‌ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటేనే మళ్లీ తిరస్కరించిన పోస్టల్‌ ఓట్లకు రీ–కౌంటింగ్‌ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు