సమరమే.. 

14 Nov, 2018 16:53 IST|Sakshi

 ఖరారైన ప్రత్యర్థులు నిర్మల్, ముథోల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన  

ఖానాపూర్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ 

‘హస్తం’ అభ్యర్థుల రాకతో ఇక పోటాపోటీ ప్రచారం 

ఇప్పటికే బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారు 

సాక్షి, నిర్మల్‌: దాదాపు రెండునెలల ఉత్కంఠకు తెరపడింది. అధికార టీఆర్‌ఎస్‌ ముందస్తుగానే అభ్య ర్థులను ప్రకటించగా.. బీజేపీ, ఇతర పార్టీలు 10 రోజుల క్రితమే  ఖరారు చేశాయి. కాంగ్రెస్‌ మా త్రం నామినేషన్ల ఘట్టం ప్రారంభమైయ్యేంత వర కు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పా ర్టీ శ్రేణులతో పాటు ప్రత్యర్థులలోనూ ఆసక్తి, ఆందోళన నెలకొన్నాయి. చివరకు సోమవారం అర్ధరాత్రి ఢిల్లీలో ఆ పార్టీ తొలిజాబితాను వెల్లడించింది. ఇందులో జిల్లాలోని నిర్మల్, ముథోల్‌ నియోజకవర్గ అభ్యర్థులుగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్‌ రామారావుపటేల్‌ పేర్లు ఖరారయ్యాయి. ఖానాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి పేరు మాత్రం పెండింగ్‌లో పెట్టారు. పోటాపోటీ ఉన్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఎవరికి టికెట్‌ ఇస్తారోనన్న ఉత్కంఠ ఇక కొనసాగుతుంది.  

‘ఏలేటి’కే టికెట్‌... 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఆసక్తికర నియోజకవర్గమైన నిర్మల్‌లో ముందుగా ఊహించనట్లే కాంగ్రెస్‌ టికెట్‌ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి దక్కింది. తనకు నియోజకవర్గంలో పార్టీ పరంగా ఎదురంటూ లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకులంతా ఆయన వెంటే ఉండటంతో ఇక్కడ అభ్యర్థిత్వానికి పోటీ లేకుండా పోయింది. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. నిర్మల్‌లో మాత్రం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నాలుగున్నర ఏళ్లుగా క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రకటన తరువాత నియోజకవర్గంలో తన బలాన్ని మరింత పెంచుకునేలా వ్యూహాలు అమలు చేశారు.
ఇందులో భాగంగా నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తితో పాటు 20మంది కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ రియల్టర్‌ అర్జుమంద్‌అలీ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు కాంగ్రెస్‌లోకి వచ్చారు. గత నెల 20న భైంసాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బహిరంగసభను విజయవంతం చేశారు. తన నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఇలా తన అభ్యర్థిత్వం ఖరారు కాకముందే పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తొలి జాబితాలోనే తన పేరు ఖరారు కావడంతో మరింత ఉత్సాహంతో ప్రచారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

‘పవార్‌’వైపే మొగ్గు... 
కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో చివరి వరకు జిల్లాలోని ముథోల్‌ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగింది. ఇక్కడ వరసకు సోదరులైనా భోస్లే నారాయణరావుపటేల్, ఆయన సమీప బంధువు పవార్‌ రామారావుపటేల్‌ మధ్య ముథోల్‌ స్థానం కోసం పోటీ కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్‌ తనకున్న పరిచయాలతో ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు కొనసాగించారు. డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండతో రామారావుపటేల్‌ రాష్ట్రస్థాయి నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భైంసాలో నిర్వహించిన రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. చివరకు పార్టీ అధిష్టానం మాత్రం రామారావుపటేల్‌ వైపు మొగ్గు చూపింది. మూడున్నరేళ్లుగా నియోజకవర్గంలో చేస్తున్న సేవ కార్యక్రమాలు, మహేశ్వర్‌రెడ్డి అండ ఉండడంతో రామారావుపటేల్‌ పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామారావుపటేల్‌కు నారాయణరావుపటేల్‌ వర్గం మద్దతు ఉంటుందా.. లేదా.. అనేది ఇంకా తేలలేదు. 

మరిన్ని వార్తలు