'ముందస్తు’ సందడి

25 Jan, 2018 16:43 IST|Sakshi

పల్లెల్లో మొదలైన ఎన్నికల వేడి

సర్పంచ్‌ పదవుల కోసం 

పావులు కదుపుతున్న ఆశావహులు

ఎమ్మెల్యేలు, జిల్లా నేతల వద్దకు పరుగు

వారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నం

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించే అవకాశముందని సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి పుట్టింది. పంచాయతీరాజ్‌ చట్టంలో పలు మార్పులు తీసుకురావడంతోపాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, రిజర్వేషన్లను పదేళ్ల వరకు కొనసాగించాలని, సర్పంచ్‌ పదవికి పరోక్షంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 500 జనాభా ఉన్న ప్రతీ గ్రామం, తండాను గ్రామంపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. నూతన చట్టంపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం ఇటీవల సీఎంకు నివేదికను అందించగా సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి భూరికార్డుల శుద్ధీకరణ, ఈపాస్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పంచాయతీ ఎన్నికల గురించి చర్చించారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం బిల్లు అమోదం కోసం వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

జూలైతో ముగింపు..
ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలైతో ముగుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే «అధికారం ఎన్నికల కమిషన్‌ ఉంది. జిల్లాలో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతనంగా 500 మంది జనాబా ఉన్న ప్రతి గ్రామం, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనుండటంతో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. 

ప్రజలతో మమేకం..
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికల్లో బరిలో నిలవాలనుకునే ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. పల్లెల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా రాజకీయ నాయకులే ముందుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలచే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. 

నేతల చుట్టూ ప్రదక్షిణలు 
సర్పంచ్‌ పదవిని ఆశించే వారు ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తే బ్యానర్లు ఏర్పాటు చేస్తూ, ప్రజలను సమీకరిస్తూ జిల్లా నాయకుల దృష్టిలో పడటానికి పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక శాసన సభ్యుల పర్యటనలు ఎక్కువగా జరిగేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు.  

మరిన్ని వార్తలు