ఎన్నికల కసరత్తు

4 Mar, 2019 06:34 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల ఖరారుతో.

రిజర్వేషన్లపై దృష్టి పెట్టిన అధికారులు

నిజామాబాద్‌: జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో ఈ పక్రియ కొనసాగుతోంది. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామాల ఏర్పాటుతో అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను మార్పులు, చేర్పులు చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత్‌ అధికారులు కొద్ది రోజులుగా ఈ పక్రియను చేపడుతున్నారు.
స్థానాల ఖరారుతో..
నిజామాబాద్‌ జిల్లాలో 25 మండలాలకు గాను 299 ఎంపీటీసీ స్థానాలు, 25 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకు 236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. స్థానాల మార్పునకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ చేపట్టిన అనంతరం ఇటీవలే తుది జాబితా విడుదల చేశారు. స్థానాలు ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. నేటి నుంచి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ  ప్రారంభం కానుంది. ఆయా మండలాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు చేపట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనంతరం ఓటర్ల లిస్టు తయారీపై దృష్టి పెట్టనున్నారు.

ఉమ్మడి జిల్లాలో 36 జెడ్పీటీసీలు ఉండగా, ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్‌ రెండు జిల్లాలు కలిపి 47 జెడ్పీటీసీ స్థానాలు అయ్యాయి. జెడ్పీల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టి ఎన్నికలు నిర్వహిస్తే వేరువేరుగా జెడ్పీటీసీ స్థానాలు కొనసాగుతాయి. నిజామాబాద్‌ జిల్లాలో పాత మండలాలు 19 ఉండగా కొత్తగా మరో ఆరు ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో పాత మండలాలు 17 ఉండగా కొత్తవి ఏడు ఏర్పడ్డాయి. ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి జిల్లాలో 36 మండలాలకు 583 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన, మున్సిపాలిటీలో గ్రామాలు విలీనం కావడంతో కామారెడ్డిలో ఏడు, నిజామాబాద్‌లో 13 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.

ఆ గ్రామాల్లో ఎన్నికలు లేనట్లేనా

మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఎన్నికలు లేనట్లే కనబడుతుంది. నిజామాబాద్‌ మండలం ముబారక్‌నగర్, గూపన్‌పల్లి, సారంగపూర్, మాక్లూర్‌ మండలం బోర్గాం(కె), మానిక్‌భండార్, కాలూరు, ఖానాపూర్‌ గ్రామాలు నిజామాబాద్‌ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. బోధన్‌ మున్సిపాలిటీలో శ్రీనివాసనగర్, ఆచన్‌పల్లి గ్రామాలు విలీనమయ్యాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటీలో పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీల్లో టేక్రియల్, అడ్లూరు, రాంమేశ్వరపల్లి, దేవున్‌పల్లి, లింగంపూర్, సారంపల్లి, పాతరాజంపేట గ్రామాలు విలీనమయ్యాయి. ఈ గ్రామాల్లో ఇటీవల సర్పంచ్‌ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కానీ ఆయా గ్రామస్తలు మున్సిపాలిటీల్లో విలీనం చేయవద్దని కోర్టు స్టే తీసుకవచ్చారు. కోర్టులో వ్యవహరం ఉండడంతో అధికారులు ఈ గ్రామాలను పక్కనబెట్టారు.  

మరిన్ని వార్తలు