దూసుకుపో..!

27 Apr, 2019 07:02 IST|Sakshi
ఎలక్ట్రిక్‌ బై సైకిల్‌... , ఎలక్ట్రిక్‌ స్కూటీ

నగర రోడ్లపైకి రానున్న ఎలక్ట్రిక్‌ సైకిళ్లు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు

గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం  

బంజారాహిల్స్‌: డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు.. రిజిస్ట్రేషన్‌తో పనేలేదు... గంటకు 25 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోవచ్చు. ఇదెలా అనుకుంటున్నారా...? కొత్తగా ఎలక్ట్రికల్‌ బై సైకిల్స్‌ నగర రోడ్లపై దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ అద్దె వాహనాల సేవా సంస్థ 4–వీల్‌ సంస్థ ఎలక్టిక్‌ బై సైకిళ్ళను ప్రవేశ పెట్టనుంది. వీటి తయారీ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న ఈ సంస్థ జూన్‌ మొదటి వారంలో ఎలక్ట్రిక్‌ సైకిళ్ళను నగర రోడ్లపై తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సైకిళ్ళు అవసరమైన వారికి అద్దెకిచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఈ సంస్థ ఒకేసారి 5 వేల సైకిళ్ళను అందుబాటులోకి తీసుకురానుంది.

అవసరమైనప్పుడు తొక్కడానికి, అలిసిపోయినప్పుడు దూసుకుపోవడానికి వీలుగా ఫెడల్‌ బై సైకిల్‌ పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ సైకిళ్ళు తయారు చేస్తున్నారు. రెండు గంటల చార్జింగ్‌తో 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఈ సైకిల్‌ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని 4–వీల్‌సంస్థ ఎండీ ఎస్‌.ఎం.జైన్‌ తెలిపారు. మెట్రోస్టేషన్లు, బస్టాప్‌లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్ళడానికి వీలుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత దగ్గర చేసేందుకు ఎలక్ట్రిక్‌సైకిళ్ళను తీసుకొచ్చామని నగర వాతావరణానికి ఇవి సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నారు. ఈడబ్లుఈ బ్రాండ్‌లో భాగంగా సైకిల్‌తోపాటు స్కూటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. 15 నిమిషాల వ్యవధికి  రూ.15 రుసుము చెల్లించాల్సి ఉంటుందని నిమిషాల పద్ధతిమీద వీటి వినియోగం ఉంటుందన్నారు. ఎకో ఫ్రెండ్లీ సైకిళ్ళ పేరుతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయని మెట్రో ఉపయోగించే వారికి ఇవి బాగా దోహదపడతాయన్నారు.  

అంతా మొబైల్‌ యాప్‌తోనే...
జూన్‌ మొదటి వారంలో అందుబాటులోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్‌ బై సైకిళ్ళను మొబైల్‌ యాప్‌ ద్వారా లాక్, అన్‌లాక్‌ చేసుకునే సదుపాయం ఉంది. దీన్ని ఉపయోగించుకునే వారు యాప్‌ ద్వారానే తమ ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. దీనికి లైసెన్స్‌కాని, రిజిస్ట్రేషన్‌ కాని అవసరం లేదు. ప్రతి నిమిషానికి 70 పైసల చొప్పున వసూలు చేస్తాం. కొన్ని చోట్ల డాకింగ్‌ ఏరియాలు కూడా గుర్తించి అక్కడ ఎలక్ట్రిక్‌ సైకిళ్ళను పార్కింగ్‌ చేసే సదుపాయాన్ని కల్పిస్తాం. మెట్రో ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అకౌంట్‌ తీసుకొని దాని ద్వారానే పేమెంట్‌ కూడా చెల్లించాల్సి ఉంటుంది.  – అశ్విన్‌ జైన్, డ్రైవెన్‌ అధినేత   

మరిన్ని వార్తలు