రోడ్లకు ఎలక్ట్రిక్‌ కిక్‌

6 Mar, 2019 11:03 IST|Sakshi
ఎలక్ట్రిక్‌ బస్సులో ప్రయాణికులు..

రోడ్డెక్కిన కాలుష్య రహిత బస్సులు

నగరం నలువైపుల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి

త్వరలో అందుబాటులోకి మరిన్ని బస్సులు  

సాక్షి, సిటీబ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కాయి. మియాపూర్‌ డిపో నుంచి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ మంగళవారం బస్సులను ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు అనువుగా మొత్తం 40 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. నగరంలో బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం  గత సంవత్సరమే ఆమోదించింది. ఈ మేరకు విద్యుత్‌తో నడిచే బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ ఆరు నెలల క్రితం ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానంలో వీటిని  ప్రవేశపెట్టారు. 

నగరం నలువైపుల నుంచి..
ప్రస్తుతం మెట్రో లగ్జరీ బస్సులు నడుస్తున్న రూట్లలోనే ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతారు. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట మార్గంలో కొన్ని బస్సులు, జేఎన్‌టీయూ నుంచి ఔటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా మరికొన్నింటిని నడుపుతారు. అలాగే పర్యాటక భవన్‌ నుంచి  మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కొన్ని బస్సులు శంషాబాద్‌ విమానాశ్రయానికి తిరుగుతాయి. సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలో మరికొన్ని బస్సులను నడుపుతారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయి. పూర్తి కాలుష్య రహితంగా, చల్లగా, ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని  అందజేస్తాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల చార్జింగ్‌ కోసం మియాపూర్‌–2, కంటోన్మెంట్‌ డిపోలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. దశలవారీగా మరిన్ని ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయానికి నడుస్తున్న మెట్రో లగ్జరీ బస్సులను మెట్రో రైళ్లు అందుబాటులో లేని హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌ తదితర ప్రాంతాలకు నడుపుతారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు