ఆర్టిజన్ల సమ్మెపై మెలిక!

29 Jul, 2018 01:49 IST|Sakshi

సమ్మె విరమణ ప్రకటన చేసిన యూనియన్‌

కొనసాగుతుందన్న జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల (ఆర్టిజన్ల) పీఎఫ్, ఈఎస్‌ఐకు సంబంధించిన విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల వాటాలను కార్మికుల వేతనాల నుంచి కోత పెట్టి చెల్లించే ప్రస్తుత విధానానికి స్వస్తి పలికి, యాజమాన్యాలే భరించేందుకు అంగీకరించాయి. ఆగస్టు 1 నుంచి కార్మికులకు ఈ మేరకు ప్రయోజనం కలిగించనున్నాయి. దీంతో గ్రేడ్‌–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్‌–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్‌–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్‌ –4 ఆర్టిజన్లకు రూ.1,900 అదనపు ప్రయోజనం కలగనుంది.

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో శనివారం సచివాలయంలో జరిగిన చర్చల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్‌తోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించేందుకు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నామని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (హెచ్‌52) ప్రకటించింది. మరోవైపు ఈ చర్చలకు తమను ఆహ్వానించకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నామని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల జేఏసీ స్పష్టం చేసింది. సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవడానికి ఆదివారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ అధ్యక్షుడు గంబో నాగరాజు పేర్కొన్నారు.   

పరిష్కరించిన డిమాండ్లు..
  విద్యుత్‌ సంస్థల్లో ఆర్టిజన్ల విలీనంపై హైకోర్టులో  స్టే తొలగింపునకు విద్యుత్‌ సంస్థల తరఫున కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు.
పీఆర్సీ 2018 సిఫారసులను ఆమోదించిన తర్వాత రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు గ్రేడ్ల వారీగా పీఆర్సీ ప్రయోజనాలు.
నిరంతర విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన ప్రత్యేక అలవెన్స్‌ చెల్లింపునకు అంగీకారం.  
సాధారణ మరణం/ప్రమాదాల్లో మరణించిన ఆర్టిజన్ల కుటుంబంలో అర్హులైన ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగావకాశం
ఆర్టిజన్‌ గ్రేడ్‌–3, గ్రేడ్‌–4గా కొనసాగుతూ నైపుణ్యం కలిగిన విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక అలవెన్స్‌లు
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లోని ఫీల్డ్‌ కార్యాలయాలు, సబ్‌స్టేషన్లలో గత రెండేళ్లుగా పని చేస్తున్న కొందరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అంగీకారం.  
విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైతే చికిత్స అందించేలా మెడికల్‌ క్రెడిట్‌ కార్డులు.
రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలోనే ఆర్టిజన్లకు సైతం సాధారణ మరణానికి రూ.10లక్షల జీవిత బీమా చెల్లింపు అంశాన్ని పరిశీలించడం.
ఇతర అన్ని న్యాయమైన డిమాండ్ల పరిశీలనకు అంగీకారం.

మరిన్ని వార్తలు