ఒక్కటి పని చేసినా ఒట్టు!

29 Apr, 2020 08:28 IST|Sakshi

నగరంలో ఎక్కడా పనిచేయని విద్యుత్‌ దహనవాటికలు

రూ.2.40 కోట్ల ప్రజా ధనం వృథా

అవి పనిచేస్తే.. కోవిడ్‌ దహన సంస్కారాలు సులువే!

సాక్షి, సిటీబ్యూరో: కరోనా (కోవిడ్‌–19) వ్యాధి సోకి బాధ పడుతుండటం ఒక ఎత్తయితే.. వ్యాధితో, లక్షణాలతో మృతి చెందిన వారి అంత్యక్రియల వ్యవహారం మరో ఎత్తు. ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విధానాలు పాటించాల్సి ఉండటం.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించడం వంటి నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు ఆస్పత్రి నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలం వరకు మృతదేహం తరలింపు తదితర అంశాలకూ ప్రత్యేక రక్షణ చర్యలు పాటించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులు అంగీకరించకపోవడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిబంధనల మేరకు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ఆయా శ్మశానవాటికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇందుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వారికి నచ్చజెప్పి ఒప్పించేందుకు సంబంధిత అధికారులు నానాతంటాలు పడుతున్నారు. 

విద్యుత్‌ దహన వాటికలుంటే ఇబ్బందులు తప్పేవి..
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ దహన వాటికలుంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్‌ దహనవాటికల్లో వైరస్‌ అనుమానాలు కూడా ఉండవని చెబుతున్నారు. ఏర్పాటు చేశారు.. విస్మరించారు.. జీహెచ్‌ఎంసీ గతంలో నగరంలోని నాలుగు ప్రాంతాల్లో విద్యుత్‌ దహనవాటికలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి దాదాపు రూ.60 లక్షల చొప్పున రూ.2.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటిని కొంతకాలం పాటు నిర్వహించారు. పరిసరాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం.. విద్యుత్‌ వినియోగ బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో వాటిని పట్టించుకోలేదు. అనంతరం అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. బన్సీలాల్‌పేట, అంబర్‌పేట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పనిచేయకపోవడం గమనార్హం. 

కనీసం ఒక్కటి వినియోగంలో ఉన్నా...
దహనం అనంతరం వెలువడే పొగ, ధూళి వల్ల తమకు ముప్పు అని పరిసరాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారి తెలిపారు. మరో వైపు ఒక్కో కేంద్రానికి నెలకు దాదాపు రూ.2లక్షల విద్యుత్‌ బిల్లులు రాగా, వాటిని చెల్లించలేదని తెలిపారు. పొగ బయటకు వెళ్లకుండా, ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు సైతం సిద్ధమైనప్పటికీ వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క విద్యుత్‌ దహనవాటిక అయినా వినియోగంలో ఉండి ఉంటే కరోనా మృతుల దహన సంస్కారాలకు ఇబ్బందులు లేకుండా సులువుగా జరిగేవని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అంతటా ఇబ్బందులే..
సొంత మనుషులనుకున్న వారు, రక్తసంబంధీకులు సైతం కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు హాజరు కాకపోతుండటం తెలిసిందే. హైదరాబాద్‌లోనే కాకుండా చెన్నై, భోపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ శ్మశానవాటికల్లో వారి అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతుండటం, దాడులకు సైతం పాల్పడుతుండటం తెలిసిందే. 

మరిన్ని వార్తలు