వ్యర్థాలతో వెలుగులు!

10 Jul, 2018 00:59 IST|Sakshi

స్వచ్ఛ బాటలో జవహర్‌నగర్‌ డంప్‌ యార్డు

85 శాతం పూర్తయిన తొలి దశ మట్టి క్యాపింగ్‌

ఏప్రిల్‌ నాటికి పనులన్నీ పూర్తి

మార్చిలో విద్యుత్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభం

రోజుకు విద్యుత్‌ ఉత్పతి లక్ష్యం 19.8 మెగా వాట్లు

సాక్షి, హైదరాబాద్‌: వివిధ అంశాల్లో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్‌ చెత్త (మునిసిపల్‌ ఘనవ్యర్థాల ఎంఎస్‌డబ్లు్య) నిర్వహణలోనూ రికార్డు కెక్కనుంది. దేశంలో ఏ నగరంలో లేని అతి పెద్ద భారీ డంపింగ్‌ యార్డు జవహర్‌నగర్‌లోని వ్యర్థాల క్యాపింగ్‌ పనులు త్వరలో పూర్తి చేయనుంది. తద్వారా పరిసర గ్రామాల ప్రజలకు వాతావరణ, భూగర్భజల కాలుష్యం తగ్గనుంది. దాదాపు 135 ఎకరాల్లో పేరుకుపోయిన 12 మిలియన్‌ టన్నుల వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

చెత్తకుప్పల నుంచి వెలువడే కలుషితాలు, వర్షం నీరు కలిసి వెలువడుతున్న కాలుష్యకారకద్రవాల (లీచెట్‌)తో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్‌ దేశాల మాదిరిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ పనుల్ని రాంకీకి చెందిన ‘హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ లిమిటెడ్‌’ చేపట్టింది.  వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నెలాఖరులోగా క్యాపింగ్‌ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే క్యాపింగ్‌లోని ఆరు దశల్లో తొలిదశలో భాగంగా 150 మి.మీ. మందం మట్టితో కప్పే ప్రక్రియను 85శాతం పూర్తిచేసింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్‌లో రెండో దశ పనుల్ని చేపట్టనున్నారు.

విషవాయువులు బయటికి వెళ్లేలా...
క్యాపింగ్‌ అనంతరం డంప్‌యార్డ్‌పై బోరు బావుల మాదిరిగా పైపులను చొప్పించి విషవాయువులు పైకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. వెలువడే గ్యాస్‌లోని వాయువుల్ని, వాటి పరిమాణాన్ని లెక్కించి, విద్యుత్‌ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. అందుకు అవకాశముంటే విద్యుత్‌ ఉత్పత్తికూడా చేస్తారు.

విషవాయువులు, లీచెట్‌ను శుభ్రపరుస్తారు. ఇప్పటికే లీచెట్‌ శుభ్రపరిచే చర్యలు పైలట్‌గా చేపట్టారు. క్యాపింగ్‌ పనుల్లో టెర్రా సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ పనుల్ని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌  సోమవారం పరిశీలించారు. క్యాపింగ్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ కృష్ణతో కలసి పనుల వివరాలను మీడియాకు వివరించారు.

మార్చిలో విద్యుత్‌ ప్లాంట్‌ పనులు..
జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ పనులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. 19.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌కు రోజుకు 1,600 మెట్రిక్‌ టన్నుల చెత్త అవసరం. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు ఈ క్యాపింగ్‌ తదితర పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 నగరాల్లోనే ఇంత పెద్ద డంపింగ్‌ యార్డులకు క్యాపింగ్‌ పనులు జరిగాయని ప్రాజెక్ట్‌ హెడ్‌ కృష్ణ తెలిపారు.


చెత్త నిర్వహణలో ఆదర్శం: బొంతు
దేశంలో ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో డంపింగ్‌ యార్డులకు క్యాపింగ్‌ పనులు చేసినా, ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత పెద్ద చెత్తగుట్టలకు ఎక్కడా క్యాపింగ్‌ జరగలేదు. అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జవహర్‌నగర్‌ మోడల్‌ డంపింగ్‌ కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది. తొలిదశలో మట్టితో కప్పేందుకు ఇప్పటివరకు 5.5 లక్షల క్యూబిక్‌ టన్నుల మట్టిని వినియోగించారు.

లీచెట్‌ శుద్ధికి 4ఎంఎల్‌డీ సామర్ధ్యమున్న యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర దుర్గంధం తగ్గింది. ప్రాజెక్టు వ్యయం రూ.144 కోట్లు కాగా, సగం కాంట్రాక్టు సంస్థ, మిగతా సగం జీహెచ్‌ఎంసీ భరిస్తున్నాయి. ఇకపై గ్రేటర్‌లోని చెత్తనంతా జవహర్‌నగర్‌కే తరలించం. నగరం నలువైపులా వివిధ ప్రాంతాల్లో చెత్త డంప్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణ చేపడతాం.

దాదాపు 50–100 ఎకరాల మేర స్థలాల్ని ఎంపిక చేసి చుట్టూ గార్డెన్‌ను అభివృద్ధి చేసి, మధ్యలో ఘనవ్యర్థాల నిర్వహణ పనులు చేపడతాం. ఆటోనగర్‌లోనూ చెత్త నిర్వహణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. గ్రేటర్‌లోని 12 చెత్త రవాణా కేంద్రాలనూ ఆధునీకరిస్తాం. వాటి నిర్వహణ బాధ్యతల్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తాం.


ఆరు దశల్లో పనులిలా..
ఆరు దశల్లో ఈ క్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేస్తారు. తొలిదశలో డంప్‌ యార్డును మట్టితో కప్పి వర్షపు నీరు చెత్తలోకి చేరకుం డా చేస్తారు. అనంతరం మట్టిపొరపైన జియోసింథటిక్‌ క్లే లైనర్‌ వేస్తారు. తర్వాత జియో కంపోజిట్‌ లేయర్‌ ఏర్పాటు చేస్తారు. చివరగా మళ్లీ మట్టిపొరను దాదాపు ఒకటిన్నర అడుగు (45సెం.మీ.) మేర పరుస్తారు. దీనిపై అందంగా కనిపించేందుకు, ఆక్సిజన్‌ వెలువడేందుకు రంగు రంగుల మొక్కలు పెంచుతారు.

>
మరిన్ని వార్తలు