నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

18 Jul, 2019 11:19 IST|Sakshi

స్మార్ట్‌సిటీలో భాగంగా కేటాయింపు

ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు

సాక్షి కరీంనగర్ : తెలంగాణ ఆర్టీసీ ఇంధన పొదుపు, కాలుష్యానికి విరుగుడుతోపాటు లాభాలు ఆర్జించడంపై దృష్టి సారిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లకుండా.. చడీచప్పుడు కాకుండా రోడ్లపై పాములా దూసుకుపోతూ మెరుగైన ప్రయాణ సేవలు అందించే ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించడంపై కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రజల ఆదరణతో సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడపించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపించడానికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు, రోడ్లు, ప్రజల ఆదరణపై గత నెల అధికారులు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే బ్యాటరీ బస్సులు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 

స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు..
జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు కరీంనగర్‌ స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు ముందస్తుగా 30 బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్సుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అభివృద్ధి చెందుతున్న సిటీలకు రాయితీపై బ్యాటరీ బస్సులు అందిస్తోంది. స్మార్ట్‌సిటీలకు 50వరకు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ముందస్తుగా కొన్నింటిని ఏర్పాటు చేసి ప్రజాదరణకు అనుగుణంగా మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  

అద్దె ప్రాతిపదికన..
స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బ్యాటరీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనుంది. ముందుగా కరీంనగర్‌లో ఎన్ని బస్సులు అవసరం ఉంటుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి యాజమాన్యం ప్రభుత్వానికి పంపిస్తుంది. బస్సుల అవసరం మేరకు బ్యాటరీ బస్సులు ఇవ్వడానికి ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నిబంధనల ప్రకారం బస్సు ధరలో రాయితీపై బ్యాటరీ బస్సులు అందచేస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌ పథకంలో ద్వారా ఇస్తున్న బ్యాటరీ బస్సులను ఆర్టీసీలో అద్దె బస్సులుగా ఏర్పాటు చేస్తుంది. 

కరీంనగర్‌లో ఏర్పాటుకు..
స్మార్ట్‌సిటీగా గుర్తించిన కరీంనగర్‌లో ఆర్టీసీ బ్యాటరీ బస్సులు నడిపించే ఆలోచన చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని సిటీబస్సులుగా సేవలు అందించాలా, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్, వరంగల్‌ వంటి ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి తేవాలా అనే విషయంపై ఇంకా అధికారులు ఆలోచనలోనే ఉన్నారు. ముందుగా బస్సు కండీషన్, బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఎంతదూరం ప్రయాణం చేయవచ్చు, అందుబాటులో ఉన్న గ్రామాలు, ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం, రోడ్ల పరిస్థితిని ఆలోచించాల్సిన అసవరం ఉంది. వీటితోపాటు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా నిర్వహణ వ్యయం అధికమవుతుందని, దీంతో చార్జీలు పెంచాల్సి ఉంటుందని సమాచారం. 

ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు..
బ్యాటరీ బస్సు ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు తిరుగుతుంది. గరిష్టంగా 300 కిలోమీటర్ల పరిధిలోనే బస్సులు నడిపించాల్సి ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌లో కూడా బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇంకా బస్సుల ఏర్పాటుపై తుది నిర్ణయం కాలేదు. 
- జీవన్‌ప్రసాద్, రీజినల్‌ మేనేజర్, కరీంనగర్‌.  

మరిన్ని వార్తలు