ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంజనీర్

2 Apr, 2015 02:01 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంజనీర్
  • ఏడీఈ శ్యాంసుందర్‌రెడ్డి ఆస్తులపై అధికారుల దాడులు
  •  పలు చోట్ల భవనాలు, ప్లాట్లు, 11 ఎకరాల స్థలం గుర్తింపు
  • సాక్షి, హైదరాబాద్: అక్రమాలకు, అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న మరో అవినీతి తిమింగలం రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి చిక్కింది. విద్యుత్ శాఖ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) చీమర్ల శ్యాంసుందర్‌రెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేసి... కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లో మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో శ్యాంసుందర్‌రెడ్డి ఏడీఈగా పనిచేస్తున్నారు.

    ఆయన అవినీతిపై సమాచారమున్న ఏసీబీ అధికారులు... హైదరాబాద్ విభాగం డీఎస్పీలు రవికుమార్, అశోక్ నేతృత్వంలో బుధవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. ఏకకాలంలో ఏడు బృందాలతో సైదాబాద్ సరస్వతీనగర్‌లోని శ్యాంసుందర్‌రెడ్డి నివాసం, కూకట్‌పల్లిలో రెండు నివాసాలు, నెరేడ్‌మెట్, బోడుప్పల్, కొంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్, దాసుపల్లిలోని ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    సంతోష్‌నగర్ కరూర్ వైశ్యా బ్యాంకు, సైదాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో శ్యాంసుందర్‌రెడ్డికి సంబంధించిన ఖాతాల లావాదేవీలను పరిశీలించారు. కరూర్ వైశ్యా బ్యాంకులోని లాకర్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడిన ఆస్తుల విలువ పత్రాల (డాక్యుమెంట్ విలువ) ప్రకారం.. రూ. 1.35 కోట్లు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ఇంతకు చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. కాగా శ్యాంసుందర్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. త్వరలో నిందితుడిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు.
     
    శ్యాంసుందర్ ఆస్తుల చిట్టా..
    సైదాబాద్ సరస్వతీనగర్‌లో భవనం
    కూకట్‌పల్లిలో రెండస్తుల భవనం (జీ+2)
    నెరేడ్‌మెట్‌లోని ఓ అపార్ట్‌మెంటులో ఫ్లాట్
    బోడుప్పల్, కొంపల్లి ప్రాంతాల్లో ప్లాట్లు
    ఒక స్విఫ్ట్ కారు
    మహబూబ్‌నగర్ జిల్ల్లాలో 11 ఎకరాల స్థలం
    ఇంట్లో ఏడు తులాల బంగారు ఆభరణాలు
    బ్యాంకు లాకర్లో 60 తులాల బంగారం

మరిన్ని వార్తలు