కరోనా హీట్‌ ముందు దిగదుడుపే..! 

7 Apr, 2020 02:04 IST|Sakshi

వేసవి వచ్చినా.. ఏసీ, కూలర్‌ వినియోగం అంతంతే

గృహ, వాణిజ్య కేటగిరీల్లో భారీగా తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా భయం ఇంటింటిని తాకింది. బయటకు వెళ్తే వైరస్‌ వస్తుందన్న భయానికి తోడు ఇంటి పట్టునే ఉంటున్నా.. ఇంట్లో సైతం వైరస్‌ బారిన పడకుండా నగరవాసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు ఎండలు ముదిరి ఉక్కపోతలు మొదలైనా.. ఏసీలు, కూలర్ల వాడకానికి మెజారిటీ ప్రజలు దూరంగానే ఉంటున్నారు. రిఫ్రిజిరేటర్లలోనూ సాధారణ ఉష్ణోగ్రతలే మెయింటైన్‌ చేస్తున్నారు. దీంతో నగరంలో గృహ, వాణిజ్య కేటగిరీల్లో విద్యుత్‌ వినియోగం అమాంతం పడిపోయింది. గడిచిన ఏడాది (2019) ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో 2,763 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగితే, 2020 ఏప్రిల్‌ 5 వచ్చే సరికి 1826 మెగావాట్లకు పడిపోయింది. ఇలా తగ్గిన డిమాండ్‌లో అత్యధికంగా గృహ, వాణిజ్య (కేటగిరీ)దే కావటం విశేషం.

డిస్కం అంచనాలు తారుమారు 
సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రోజుకు 2,550 మెగావాట్ల నుంచి 2,800 మెగావాట్ల వరకు విద్యుత్‌ వినియోగం జరగాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) కూడా అదే అంచనాలతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ, గతానికి భిన్నం గా ఈసారి ప్రస్తుతం రోజువారీ సగటు విద్యుత్‌ వినియోగం భారీగా పడిపోవటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది నెలవారీ రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో భవిష్యత్తులో భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు 2,500 మెగావాట్లు.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో 55 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 45 వేలకు పైగా చిన్న, పెద్ద, భారీ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. మరో 7 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. 48 లక్షలకు పైగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు మార్చి మొదటి వారంలో నగరంలో రోజు సగటు వినియోగం 2,500 నుంచి 2,800 మెగావాట్లుగా ఉంది. గతేడాది అయితే ఏకంగా 3 వేల మెగావాట్ల వరకు వెళ్లింది. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో చాలా వరకు మూతపడ్డాయి. ఐటీ, దాని అనుబంధ సంస్థలు సహా భారీ షాపింగ్‌ మాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలూ పని చేయట్లేదు. ఫలితంగా రోజువారీ సగటు వినియోగం 2,500 నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయింది.

సమ్మర్‌ మార్కెట్‌ ఢమాల్‌.. 
వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దుకాణాలన్నీ ఏసీ, కూలర్ల కొనుగోలుదారులతో నిండిపోయేవి. అబిడ్స్‌లోని ఎలక్ట్రానిక్‌ దుకాణాలన్నీ కూలర్లతో సందడిగా కన్పించేవి. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఆయా షాపులు మూతపడ్డాయి. ఇంట్లో ఏసీ ఆన్‌ చేస్తే.. చలిగాలికి వైరస్‌ ఎక్కడ విస్తరిస్తుందో అని గ్రేటర్‌వాసులు భయపడుతున్నారు. ఏసీలను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా చేయట్లేదు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సహా డీలర్లు కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

ఏప్రిల్‌5న హైదరాబాద్‌లో విద్యుత్‌ డిమాండ్‌ ఇలా.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు