డంపింగ్‌ యార్డ్‌ చెత్త నుంచి విద్యుత్‌

28 Jan, 2020 03:59 IST|Sakshi

హైకోర్టుకు తెలిపిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌ నుంచి వెలువడే మీథేన్‌ వాయువు ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ హైకోర్టుకు చెప్పారు. రెండు నెలల్లో రెండు విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మరో రెండు నెలల్లోగా మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దోమలు, దుర్వాసన వంటి పలు సమస్యల్ని ఎదుర్కొనడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రతిని జత చేసి నగరానికి చెందిన సీతారాంరాజు రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్‌ కుమార్‌ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పత్రికల్లో డంపింగ్‌ యార్డ్‌ వల్ల సమస్యల గురించి వార్తలు వస్తున్నాయని, దుర్గంధం వల్ల అక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జీహెచ్‌ఎంసీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. యార్డ్‌ 337 ఎకరాల్లో చెత్త ఉండేదని, 137 ఎకరాలకు తగ్గించామని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తపై పాలిథిన్‌ కవర్లు మట్టిని వేస్తున్నామని, ఇదే మాదిరిగా పలు పొరలుగా వేస్తామని, దీని వల్ల దుర్వాసన బయటకు వెళ్లదని కమిషనర్‌ వివరించారు.

డంపింగ్‌ యార్డ్‌లో చెత్త వేసే పరిధి తగ్గించవచ్చని, అయితే చెత్త వెలువడే దుర్వాసన తగ్గేలా ఎందుకు చేయలేక పోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకేచోట చెత్త పేరుకుపోయి ఉంటే అందులోని దుర్గంధమైన నీరు భూమిలోకి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చెత్తలో వానపాములు వేసి కొంతవరకూ సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, చెత్తను ఎండబెట్టేలా చేసి నివారణ చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు