విద్యుత్‌ శాఖలో అంతా మా ఇష్టం

16 Sep, 2019 10:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్థానికంగా ఉండని విద్యుత్‌ అధికారులు

తరచుగా కరెంట్‌ సరఫరాలో అంతరాయం

సీఎండీ ఆదేశాలు బేఖాతర్‌

సాక్షి, నిజామాబాద్‌/నాగారం: విద్యుత్‌శాఖలో అధికారులతో పాటు సిబ్బంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో తరచుగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అధికారులు సిబ్బంది స్థానికంగా ఉంటేనే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఈ విషయాన్ని పలుమార్లు సీఎండీ సమీక్ష సమావేశాల్లో సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. అయినా కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది.

ఎందుకిలా జరుగుతోంది.. 
నిజామాబాద్‌ జిల్లాలో అధికారులే స్థానికంగా ఉండడం లేదు. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు సక్రమంగా విధులు నిర్వహిస్తే కరెంట్‌ సమస్యలు రావు. ఏళ్ల తరబడిగా కరెంట్‌ సరఫరాలో బ్రేక్‌డౌన్స్, లూజ్‌వైర్లు తదితర సమస్యలతో వినియోగదారులు, రైతులు సతమతం అవుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లాలో అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో..
జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ డివిజన్‌లల్లో అధికారులు, క్షేత్రస్థాయిలో సిబ్బంది వారికి కేటాయించిన సెక్షన్‌లో విధులు నిర్వహించడం లేదు. డివిజిన్‌ కేంద్రాల్లో ఉంటే 12శాతం హెచ్‌ఆర్‌ఏ, రూరల్‌ పరిధిలో ఉంటే 10శాతం హెచ్‌ఆర్‌ఏ విద్యుత్‌సంస్థ చెల్లిస్తోంది. బోధన్‌ డివిజన్‌లో దాదాపుగా అందరూ వారికి కేటాయించిన స్థానా ల్లో కొనసాగట్లేదు. హెచ్‌ఆర్‌ఏ వదులుకోరు.. పైగా అందుబాటులో ఉండరు.. దీంతో వీరికి తోడు  క్షేత్రస్థాయిలో ఆయా సెక్షన్‌ల పరిధిలో విధులు నిర్వహించే జూనియర్‌ లైన్‌మెన్, అసిస్టెంట్‌ లైన్‌మెన్, లైన్‌మెన్‌ తదితర సిబ్బంది ఎవరూ కూడా వారికి కేటాయించిన పరిధిలో, గ్రామాల్లో ఉండి విధులు నిర్వహించడం లేదు. అధికారులే హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుంటే మేము ఎందుకు ఉంటామనే సిబ్బంది కూడా ఉండడం లేదు.

చిన్న గాలి వచ్చిందా..కరెంట్‌ గోవిందా..
నాణ్యమైన విద్యుత్‌సరఫరా దేవుడెరుగు.. కనీసం వచ్చే కరెంట్‌ కూడా సక్రమంగా ఉండడం లేదు. ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుంది.. అధికారులు అందుబాటులో లేకపోవడంతో చిన్నపాటి గాలులకు వర్షాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. గంటల తరబడిగా విద్యుత్‌రాని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో రాత్రి అంతా చీకట్లో ఉండే సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలా కరెంట్‌ సరఫరాలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని అధికారులకు ఫోన్ల ద్వారా విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదు.. ఎవరికి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కాకుండా ముందస్తుగానే లూజ్‌లైన్సు, బ్రేక్‌డౌన్సు తదితర వాటిని పరిష్కరించుకోవాలి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగానే మేల్కోంటున్నారు. అదే ముందస్తుగా విద్యుత్‌ సరఫరాలో ఇక్కట్లు రాకుండా చూసుకోవాలి. కానీ అలా చేయడం లేదు.

చర్యలు తీసుకుంటాం..
సీఎండీ ఆదేశాలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందే. విద్యుత్‌ వినియోగదారులకు, రైతులకు మెరుగైనా సరఫరా అందించడానికి ప్రతిఒక్కరూ నిబద్దతతో పనిచేయాలి. హెడ్‌క్వార్టర్స్‌లో ఉండని వారిపై చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితమే సం బంధిత డీఈలకు, ఎస్‌ఏఓకు ఆదేశాలు ఇచ్చాను. రైతులకు, వినియోగదారులు కరెంట్‌ సరఫరాలో ఇబ్బందులు ఉంటే సిబ్బందికి, అధికారులకు ఫోన్‌చేసి పరిష్కరించాలి, స్వతహాగా పనులు చే యవద్దు.  టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912, 18004 250028 ఫోన్‌ చేయాలి.  
– బి.సుదర్శనం, జిల్లా విద్యుత్‌ శాఖాధికారి

>
మరిన్ని వార్తలు