బస్సు ఎక్కడుందో.. ఎప్పుడొస్తుందో  చూపే ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లేలు 

4 Nov, 2017 02:29 IST|Sakshi

ప్రయోగాత్మకంగా నేడు కోఠి–సికింద్రాబాద్‌ మార్గంలో.. 

సాక్షి, హైదరాబాద్‌: బస్టాప్‌లలో ప్రయాణికులు నిత్యం తమ తోటివారిని ఎప్పుడూ ఓ ప్రశ్న అడుగుతుంటారు. ఈ బస్సు ఎప్పుడొస్తుంది అని..! అడిగేవారికి ఎలా ఉన్నా చెప్పేవారు మాత్రం చిరాకుగా ఫీలవుతుంటారు. ఏదేమైనా ఎవరి సాయం లేకుండా ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు చేరుకుంటుందో అనే కచ్చితమైన సమాచారాన్ని తెలిపే ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డును బస్టాపుల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది ఆర్టీసీ ఈ ఆలోచనతోనే హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ సాంకేతిక సహకారంతో స్మార్ట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాజెక్టుకు ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. పైలట్‌ ప్రాజెక్టుగా కోఠి–సికింద్రాబాద్‌ మార్గంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 42 బస్సులతో ఈ వ్యవస్థను అనుసంధానిస్తున్నారు. 

బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు 
ఇప్పటికే రెండు ఫ్రెంచి కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశాయి. దీన్ని భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ శనివారం స్వయంగా పరిశీలించి ప్రారంభించనున్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావుల సమక్షంలో దీన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్న ఫ్రెంచి కంపెనీల నిర్వాహకులు ఈ ప్రాజెక్టు పనిచేసే తీరును ఫ్రాన్స్‌ రాయబారి, రవాణాశాఖ మంత్రి, అధికారులకు వివరిస్తారు. అలాగే అది పనిచేసే తీరును సోలార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డుపై ప్రత్యక్షంగా పరిశీలించి చూపుతారు.
 
ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం.. 

50 లక్షల వాహనాలతో కిటకిటలాడుతున్న భాగ్యనగరంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలతో సగటు ప్రయాణికుడు నానా ఇబ్బంది పడాల్సివస్తోంది. బస్సు ప్రయాణికులు ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోలార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దీని సాయంతో ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు చేరుకుంటుందో, దాని వెనక మరెన్ని బస్సులు ఎక్కడెక్కడున్నాయో తదితర కచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవచ్చు.  

మరిన్ని వార్తలు