ఓటు యంత్రం.. అవగాహన మంత్రం

9 Nov, 2018 11:56 IST|Sakshi

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ పనితీరుపై వివరణ 

ఓటు ఎవరికి వేశామో వీవీ ప్యాట్‌తో తెలుసుకునే వెసలుబాటు 

ఓటర్లకు అవగాహన కల్పించడంలో నిమగ్నమైన అధికారులు  

సాక్షి, కల్వకుర్తి టౌన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికి తెలిసేలా అధికార యంత్రాం గం ఊరురా విసృత్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకవైపు రాజకీయ నాయకులు తమకే ఓటు వేయాలని ప్రచారం చేస్తుండగా, మరోవైపు అధికారులు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎం ద్వారా ఓటు వేసిన తర్వాత ఎవరికీ ఓటు పడిందో తెలుసుకునేలా కొత్తగా ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ యంత్రాలను ఎన్నికల కమిషన్‌ వినియోగిస్తోంది. రెవెన్యూ అధికారులు, బీఎల్‌ఓలు గ్రామగ్రామాన ఈవీఎం, వీవీప్యాట్‌లపై ప్రచారం చేస్తున్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని అన్ని బూత్‌ల పరిధిలో ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రదేశాల వద్ద అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీఓలు, బూత్‌ స్థాయి అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏకేపీ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై ప్రయోగాత్మకంగా ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్నారు. ఎలా ఓటు వేయాలి.. ఎవరికి ఓటు వేశామన్నది వీవీ ప్యాట్ల ద్వారా ఎలా తెలుస్తుందో ప్రత్యక్షంగా వివరిస్తున్నారు.


ఓటు ఎవరికి వేశాం?! 
ఈసారి ఎన్నికల సంఘం కొత్తగా వీవీ ప్యాట్‌ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ప్రక్కనే ఉన్న వీవీ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు వేసిన గుర్తు అందులో కనిపిస్తుంది. దీంతో ఓటరు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు వీవీ ప్యాట్లు ఉపయోగపడుతాయని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. 


పూర్తిస్థాయిలో అవగాహన  

కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో అన్నిల పోలింగ్‌బూత్‌ వద్ద ఈవీఎం, వీవీ ప్యాట్‌ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే, వారి నుండి స్పందన కూడా బాగుంది. ప్రతీ బూత్‌ వద్ద బీఎల్‌ఓలు, ఆయా బూత్‌ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమంపై ప్రజల నుండి వస్తున్న స్పందనతో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. 
– రాఘవేందర్, కల్వకుర్తి ఎన్నికల డీటీ 


ప్రతిఎన్నికల్లో ఓటు వేస్తున్నా.

నేను గత ఎన్నికలతో పాటుగా అంతకుముందు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నా. పాత రోజుల్లో ఓటుకు చాలా విలువ ఉండేది. ప్రస్తుతం చాలా మంది ఓటుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మొన్నటి వరకు ఈవీఎం యంత్రంలో ఓటు వేశా, ఇప్పుడు కొత్తగా వీవీ ప్యాట్‌లో ఓటు వేసిన గుర్తు ఏడు సెకన్ల పాటు చూసుకునే అవకాశం బాగుంది. 
– రాజేష్‌కుమార్, కల్వకుర్తి 


వీవీ ప్యాట్‌ యంత్రంతో పారదర్శకత 

ఈసారి ఎన్నికల్లో ఈవీఎంతో పాటుగా మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే విధంగా వీవీప్యాట్‌ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం శుభపరిణామం. దీనితో గతంలో ఓటరు ఎవరికి ఓటు వేశాడో తెలియకపోయేది. ఈసారి వీవీ ప్యాట్‌ యంత్రం ద్వారా ఓటరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు. దీంతో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. 
– భీమయ్య, కల్వకుర్తి 

మరిన్ని వార్తలు