న్యాయం చేయకపోతే దూకేస్తా...

28 Dec, 2018 08:03 IST|Sakshi
కేటీపీఎస్‌ 7వ దశలోని విద్యుత్‌ టవర్‌ లైన్‌

పాల్వంచ: కేటీపీఎస్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన తనను ఆర్టిజన్‌గా తీసుకోకపోవడంతో ఆవేదన చెందిన కార్మికుడు, విద్యుత్‌ టవర్‌ లైన్‌ ఎక్కాడు. పట్టణంలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను, గురువారం స్థానిక కేటీపీఎస్‌ 7వ దశలోని 400 కేవీ విద్యుత్‌ లైన్‌ ఎక్కాడు. తాను కేటీపీఎస్‌ 6వ దశ నిర్మాణంలో, భూపాలపల్లి కర్మాగారంలో, కేటీపీఎస్‌ 7వ దశలో ఏళ్లతరబడి నిర్మాణ కార్మికుడిగా పనిచేశానని, తనను ఆర్టిజన్‌ కార్మికుడిగా అధికారులు గుర్తించడం లేదని, తనకు న్యాయం చేయకపోతే దూకి చనిపోతానంటూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. పట్టణ అదనపు ఎస్‌ఐ రవి, ఎస్‌పీఎఫ్‌ ఎస్‌ఐ తిరుపతి చేరుకున్నారు.

సీఈ సమ్మయ్యతో ఎస్‌ఐ రవి మాట్లాడారు. గుగులోతు శ్రీనుతో సెల్‌ ఫోన్‌లో సీఈ మాట్లాడారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావును కల్పించి సమస్య పరిష్కరిస్తానని సీఈ హామీ ఇవ్వడంతో శ్రీను శాంతించి, సాయంత్రం 5.30 గంటల సమయంలో టవర్‌ లైన్‌ పైనుంచి కిందకు వచ్చాడు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 22న ఓ యువకుడు (షల్‌మోహన్‌ నరేష్‌ బాబు) కూడా విద్యుత్‌ టవర్‌ లైన్‌ ఎక్కిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఐదు రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలోని మరో విద్యుత్‌ టవర్‌ లైన్‌ను శ్రీను ఎక్కాడు.

మరిన్ని వార్తలు