‘ఎలివేటెడ్‌’కు రక్షణ శాఖ భూములు

14 Jul, 2017 02:53 IST|Sakshi
‘ఎలివేటెడ్‌’కు రక్షణ శాఖ భూములు

ఆ శాఖాధికారులతో చర్చించేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్న సునీల్‌శర్మ
బైసన్‌పోలో అంశంపై చర్చకు వచ్చే నెల హస్తినకు సీఎస్‌


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి కరీంనగర్, నిజామాబాద్‌ రహదారులకు చేరుకునేలా నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్ల కోసం భూసేకరణ మార్గం సుగమమైంది. కారిడార్ల కోసం సేకరించాల్సిన రక్షణ శాఖ భూముల విషయమై ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. ప్యారడైజ్‌ కూడలి నుంచి శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్‌ జాతీయ రహదారిపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ కారిడార్లకు రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరటంతో ఆ శాఖ సానుకూలంగా స్పందించింది.

అయితే ఇప్పటివరకు అధికారికంగా మంజూరీ రాలేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రక్షణ శాఖను భూముల విషయమై కోరడంతో ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. సికింద్రాబాద్‌–సఫిల్‌గూడ, సికింద్రాబాద్‌–రామకృష్ణాపురంలను అనుసంధానిస్తూ కంటోన్మెంట్‌లోని ఏఓసీ గుండా ఉన్న రోడ్డును మూసేయనున్నట్టు ఇదివరకే రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణానికి కూడా రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. ఈ మూడు రహదారులకు సంబంధించి చర్చించేందుకు రక్షణ శాఖ ఆహ్వానించటంతో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రక్షణ శాఖ అధికారులతో జరిగే ఈ చర్చల్లో భూసేకరణ వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

బైసన్‌పోలో గ్రౌండ్‌ కేటాయింపుపై..
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలోని బైసన్‌పోలో మైదానం తీసుకోని అందుకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ విషయాన్ని ఆ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం ఢిల్లీ పర్యటనలోనూ చర్చలు జరిగాయి. అయితే స్థానిక కంటోన్మెంట్‌ అధికారులు సానుకూలంగా లేకపోవటంతో నేరుగా ఢిల్లీ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు రక్షణ శాఖ నుంచి పూర్తి సానుకూలత రాలేదు.

 ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులతో చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఢిల్లీ పర్యటనలోనూ దీని ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నా ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మైదానాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ అంతర్గత మాటల్లో సానుకూలత వ్యక్తం చేసిందంటున్నారు.

మరిన్ని వార్తలు