జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత నిబంధనలు

29 Oct, 2017 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 20న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన అర్హతల వివరాలను ఐఐటీ కాన్పూర్‌ శనివారం అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు ప్రధానం గా 5 అంశాల్లో అర్హతలు ఉండాలని వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.24 లక్షల మందిలో ఒకరిగా ఉండాలని పేర్కొంది. విద్యార్థులు 1993 అక్టోబర్‌ 1న, లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలని, ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల సడలింపు ఉందని, వారు 1998 అక్టోబర్‌ 1న, లేదా ఆ తర్వాత పుట్టినవారై ఉండాలని పేర్కొంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను వరుసగా 2సార్లే రాయాలని పేర్కొంది. 2017 లో లేదా 2018లో ఇంటర్‌ పరీక్షలను మొదటిసారిగా రాసిన వారే అర్హులు. గతంలో ఐఐటీల్లో చేరిన వారు, రిపోర్టింగ్‌ కేంద్రాలకు వెళ్లి సీటు యాక్సెప్టెన్సీ ఇచ్చిన వారు, ఐఐటీల్లో చేరి తర్వాత సీటు రద్దు చేసుకున్న వారు 2018లో పరీక్షకు అనర్హులని వివరించింది. అభ్యర్థులు ఇంటర్‌లో 75% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 65%) సాధించి ఉండాలని తెలిపింది. కేటగిరీల వారీగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యనూ వెల్లడించింది.

మరిన్ని వార్తలు