నాటుకున్న ఆశలు

13 Aug, 2015 02:46 IST|Sakshi
నాటుకున్న ఆశలు

ఇన్నాళ్లూ వర్షాభావం.. తీరా రెండు చినుకులు పడ్డాయనుకుంటే కొద్ది ప్రాంతాలపై పక్షపాతం.. ఇదీ మెతకుసీమపై ప్రకృతి శీతకన్ను. మొత్తానికి మూడు రోజులుగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడుతున్న వానలతో పంటలు కోలుకున్నాయి. ఆరుతడి పంటలు ప్రాణం పోసుకున్నాయి. మెట్ట ప్రాంత రైతులు ఊరట చెందుతున్నారు. వరి పంటకు అనుకూలమైన వర్షం కురవకపోయినా అంతే ప్రధాన పంటగా భావించే పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, పెసర పంటలకు ఈ వర్షం మేలు కలిగించే అవకాశం ఉంది.

జోగిపేట, మెదక్, దుబ్బాక, నారాయణఖేడ్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది. ఈ వానలతో కొత్త ఆశలు మొలకెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు నాట్లు వేసుకుంటున్నారు. మొక్కజొన్నకు మందులు కొడుతున్నారు.

 ముమ్మరంగా దుక్కులు.. నాట్లు
 మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పొలాల మడిక ట్లపై భారీగా నీరు చేరడంతో బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు దున్నకాలు, నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నచోట్ల నాట్లు వేసే పనుల్లో మునిగారు. కొద్ది రోజులు ఇలాగే మోస్తరు వానలు పడినా ఇప్పటికే వేసిన పంటలైనా దక్కుతాయని, భూగర్భ జలాలు పెరిగి వచ్చే రబీకి మేలు కలుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

 ప్రాణం పోసుకుంటున్న పంటలు
 జిల్లాలో రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్‌పై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. అటువంటి తరుణంలో కురిసిన వానలతో రైతులతో పాటు పంటలకూ ప్రాణం లేచొచ్చింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు చెప్పుకోదగిన స్థాయిలో కోలుకున్నాయి. అయితే, అడపాదడపా భారీ వర్షాలు పడితేనే ఈ పంటలు నిలుస్తాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి పంటలకు తడుల మందం వస్తున్నాయి. దీంతో రైతులు ఎరువులు, మందుల కొనుగోళ్లపై పడ్డారు. వరి నాట్లు కోసం మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వాడిపోతూ పీడల బారిన పడిన పత్తికి మందులు కొట్టే పనులూ ముమ్మరమయ్యాయి.
 - జోగిపేట/వెల్దుర్తి/కౌడిపల్లి/  చిన్నకోడూరు
 
 పొద్దుతిరుగుడు మేలు
 ప్రస్తుత వర్షాల తరుణంలో పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు. ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలకు ఈ వర్షం చాలా మేలు చేస్తుంది. ఇదే వర్షం 15 రోజుల ముందు పడి ఉంటే వరినాట్లు పడి.. మొలక దశలో ఉండేది.
 - శ్రీలత, జోగిపేట వ్యవసాయాధికారిణి

మరిన్ని వార్తలు