నీళ్లు ఫుల్‌

10 Aug, 2019 09:28 IST|Sakshi

గ్రేటర్‌ వరదాయినులకు వరద  

పుష్కలంగా కృష్ణా, గోదావరి జలాలు  

నాగార్జునసాగర్, ఎల్లంపల్లి

జలాశయాలకు జలకళ  

అత్యవసర పంపింగ్‌ ఆపేసిన అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ దాహార్తి తీరుస్తోన్న జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. కృష్ణా, గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో నగరానికి అత్యవసర పంపింగ్‌ కష్టాలు తీరాయి. నాగార్జునసాగర్‌ నుంచి అక్కంపల్లి మీదుగా కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 1,253 మిలియన్‌ లీటర్ల తాగునీటిని గ్రేటర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో నాగార్జునసాగర్‌ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. మరో వారం రోజుల్లో సాగర్‌ 590 అడుగుల గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సాగర్‌ బ్యాక్‌వాటర్‌ వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్లను యుద్ధప్రాతిపదికన  తొలగించామన్నారు. ఇక సిటీకి గోదావరి జలాలను తరలిస్తోన్న ఎల్లంపల్లి జలాశయానికి సైతం కాళేశ్వర గంగ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ జలాశయంలో 485.560 అడుగుల గరిష్ట మట్టానికి నీటి నిల్వలు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఈ జలాశయం నుంచి నగరానికి నిత్యం 771 మిలియన్‌ లీటర్ల జలాలను తరలిస్తున్నారు. ఆయా జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో నగరవాసులకు ఇక నుంచి పుష్కలంగా తాగునీరు అందించవచ్చని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. 

అదనంగా 200 మిలియన్‌ లీటర్లు  
నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఎల్లంపల్లి, నాగార్జునసాగర్, అక్కంపల్లి జలాలే ఆదరువయ్యాయి. మరోవైపు నగరానికి ఆనుకొని ఉన్న ఉస్మాన్‌సాగర్‌(గండిపేట్‌), హిమాయత్‌సాగర్‌ల నుంచి సైతం నిత్యం 123 మిలియన్‌ లీటర్ల తాగునీటిని సేకరించి, శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. మొత్తంగా ఆయా జలాశయాల నుంచి రోజూ వారీగా 2,147 మిలియన్‌ లీటర్ల జలాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్, ఎల్లంపల్లి జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో నగరానికి అదనంగా మరో 200 మిలియన్‌ లీటర్ల జలాలను తరలించే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ నీటిని ఇటీవల హడ్కో తాగునీటి పథకం, ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకం కింద నూతనంగా నిర్మించిన 225 భారీ స్టోరేజీ రిజర్వాయర్లలో నిల్వ చేసి నగరం నలుమూలలకు సరఫరా చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.  

కష్టాలుండవ్‌..  
వర్షాకాలం ప్రారంభంలో వరుణుడు ముఖం చాటేయడంతో నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ (పుట్టంగండి) వద్ద నుంచి అత్యవసర పంపింగ్‌ చేపట్టి కృష్ణా జలాలు సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో నగరానికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం మూడు, నాలుగురోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్న ప్రాంతాలకు ఇక నుంచి రోజు విడిచి రోజు సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా, వేళలను కుదించడం లాంటి కష్టాలు ఉండవని అధికారులు భరోసా ఇస్తున్నారు.  

నీటివృథాను అరికట్టాలి
సాక్షి, సిటీబ్యూరో: తాగునీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత జలమండలి లైన్‌మెన్లదేనని బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన లైన్‌మైన్లకు తాగునీటి వృథాపై అవగాహన కల్పించారు. నగరానికి సరఫరా చేస్తున్న నీటిలో నిత్యం 50 మిలియన్లు రహదారుల పాలవుతోందన్నారు. గుర్తించిన 150 ప్రాంతాల్లో జలమండలి లైన్‌మెన్లు నీటివృథాను ఎలా అరికడుతున్నారన్న అంశంపై ఎండీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఇంకుడుగుంతలు నిర్మించారు? నల్లా నీటితో వాహనాలు, వరండాలు శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. పరిశీలించిన అంశాలపై లైన్‌మెన్లు ఓ నమూనా పూర్తిచేసి జనరల్‌ మేనేజర్లకు సమర్పించాలని సూచించారు. మంచినీటి పైపులైన్లకున్న వాల్వూ తిప్పితే ఎన్ని ఇళ్లకు నీరు సరఫరా అవుతుంది? ఆయా ఇళ్లకు నీటి సరఫరా, బిల్లింగ్‌ విషయాల్లో వస్తున్న వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ఈ పరిశీలన ద్వారా ఏ ప్రాంతాల్లో తాగునీటి వృథా జరుగుతుందన్న విషయం తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్క లైన్‌మెన్‌ తమ పరిధిలో ఒక ఇంజెక్షన్‌ బోర్‌వెల్, ఒక ఇంకుడుగుంత నిర్మించే విధంగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు–2 డైరెక్టర్‌ డి.శ్రీధర్‌బాబు, టెక్నికల్‌ డైరెక్టర్‌ వి.ఎల్‌.ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు