మూగబోయిన 108

18 Aug, 2018 03:13 IST|Sakshi

ఉద్యోగుల సమ్మెతో ఎక్కడికక్కడే నిలిచిన సేవలు

620 యాజమాన్యం తొలగించిన ఉద్యోగుల సంఖ్య

సకాలంలో వైద్యం అందక పలువురు మృత్యువాత

ఉప్పల్‌ బీరప్పగూడకు చెందిన తలారి ప్రభాకర్‌(52) శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ‘108’కు ఫోన్‌ చేశారు. ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో సర్వీసు అందించలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక ఆయన మృతి చెందాడు. భార్య తరఫు బంధువులు తనపై కేసు పెట్టడంతో మనస్తాపం చెందిన బంజారాహిల్స్‌కు చెందిన సతీశ్‌కుమార్‌  2 రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌ ముందే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినా ఫలితం కానరాలేదు. చివరికి ఆటోలో ఆస్పత్రికి తరలించారు.  ఇలా ప్రభాకర్, సతీశ్‌కుమార్‌లకు మాత్రమే కాదు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ అంబులెన్సులకు ఫోన్‌ చేసిన వారందరికీ అక్కడ చేదు అనుభవమే ఎదురవుతోంది.
 

ఉద్యోగుల డిమాండ్లివే..
8 గంటల పనివిధానాన్ని అమలు చేయాలి
 ఉద్యోగులకు భద్రత కల్పించాలి
  జీఎంఎస్‌ నంబర్‌ 3 ప్రకారం వేతనాలివ్వాలి
ఐదేళ్ల నుంచి రావాల్సిన ఓటీ పేమెంట్‌ను వెంటనే అందజేయాలి
‘పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ ’విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
వైద్య ఆరోగ్యశాఖ చట్టాల పరిధిలోకి తీసుకురావాలి

సాక్షి, హైదరాబాద్‌: ఆపదలో పిలిస్తే చాలు కుయ్‌.. కుయ్‌.. మంటూ పరుగెత్తుకొచ్చే 108.. ఉద్యోగుల సమ్మెతో మూగబోయింది. అత్యవసర పరిస్థితుల్లో కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే కనీస స్పందన లభించడం లేదు. ఫలితంగా సత్వర వైద్యం అందక క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. ఉద్యోగులతో చర్చించి సమస్యను పరిష్కరించాల్సిన యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. పంతానికిపోయి శిక్షణలేనివారిని తాత్కాలిక పైలెట్లుగా నియమించి వాహనాలను బయట తిప్పుతుండటంతో అవి దెబ్బతినడమే కాకుండా మరిన్ని సమస్యలు వస్తున్నాయి.  

సమ్మె తెస్తున్న నష్టం...
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 2005, ఆగస్టు 15న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 108 సేవలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 333 సర్వీసులుండగా, వీటిలో 317 సర్వీసులు ఆన్‌రోడ్‌లో ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రాథమిక వైద్యసేవలు అందించడంతోపాటు సత్వర వైద్యసేవల కోసం ఆస్పత్రులకు చేరుస్తుంటాయి.

ఒక్కో సర్వీసు రోజుకు సగటున ఐదు, ఆరు కేసులను ఆసుపత్రులకు చేరుస్తుంటాయి. కార్మిక చట్టాల ప్రకారం పనికి తగిన వేతనం చెల్లించాలని, 8 గం టల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ సమ్మెలోకి దిగారు. ప్రత్యామ్నాయంగా యాజమాన్యం మరో ఆరు వందల మందిని విధుల్లోకి తీసుకుంది. వీరిలో చాలామందికి వాహనాలు నడిపిన అనుభవం లేకపోవడం, ప్రాథమిక వైద్యసేవలపై అవగాహన లేకపోవడంతో క్షతగాత్రులను కాపాడలేకపోతున్నారు.

8 గంటలకు యాజమాన్యం నో..
ఒక్కో అంబులెన్స్‌లో పైలట్‌ సహా ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌(ఈఎంటీ) ఉంటారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు రెండు షిఫ్ట్‌ల విధానంలో పనిచేయాలి. వీరిలో 1,587 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు. చాలామంది 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఇప్పటికీ రూ.11 వేలకు మించి వేతనం లభించడం లేదు. ఉద్యోగులంతా ఒకేసారి సమ్మెలోకి వెళ్లడంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఇప్పటికే 620 మందిని తొలగిస్తున్నట్లు నోటీసులు ఇచ్చింది.

సమ్మెలో ఉన్న కొందరు ఉద్యోగులు 8 గంటలు పనిచేయడానికి సిద్ధమని శుక్రవారం ఉదయం విధులకు వెళ్లారు. వీరిని జీవీకే ఈఎంఆర్‌ఐ యాజమాన్యం తిప్పి పంపడంపై యూనియన్‌ అధ్యక్షుడు పల్లె అశోక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు 108 సేవల విభాగం సీవోవో బ్రహ్మానందరావు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు