ఉన్నత ఉద్యోగాలు వదిలి ఎన్నికల్లో..

18 Jan, 2020 08:08 IST|Sakshi
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి, సివిల్స్‌కి సిద్ధమవుతూ

సాక్షి, కామారెడ్డి : వీరు ఉన్నత చదువులను చదివారు.. విద్యావంతులుగా ఉండి ప్రజా సేవలో ముందుంటామని వస్తున్నారు.. వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల బరిలో కొందరు ఉన్నత విద్యావంతులు నిలిచారు. సివిల్స్‌కు సిద్ధమవుతూ, ప్రొఫెసర్లుగా, లెక్చరర్‌గా, టీచర్లుగా ఇలా విద్యావంతులు ఎన్నికల పోటీలో ఉన్నారు. వారి వార్డులో మంచి ఆదరణకు కూడా వస్తుంది. ఓటర్లు కూడా విద్యావంతుల వైపు చూస్తున్నారు. వీరంతా ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీలో దిగుతున్నారు.
   
సివిల్స్‌కి సిద్ధమవుతూ..
పట్టణంలోని 33 వార్డులకు చెందిన నట్టు జాహ్నవి మున్సిపల్‌ బరిలోకి దిగింది. 49 వార్డుల్లోని పోటీదారులందరి వయస్సుతో పోల్చితే ఈమెది చిన్న వయస్సు. 25 ఏళ్లు ఉంటుంది. ప్రసుత్తం సివిల్స్‌కు సిద్ధమవుతోంది. ప్రజలలో ఉంటే తనకు ఇంకా అనుభవం వస్తుందని, ప్రజా సేవ అంటే ఇష్టంతో, తండ్రి నిట్టు వేణుగోపాల్‌రావు ప్రోత్సాహంతో కౌన్సిలర్‌గా పోటీ చేస్తోంది. ఎంఏ బీఈడీ చేసి, ఎల్‌ఎల్‌బీ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతోంది. నిట్టు జాహ్నవి టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేస్తూ చైర్‌పర్సన్‌ రేస్‌లో కూడా ఉంది. తన ఉన్నత చదువులు, నూతన పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తానని అంటోంది జాహ్నవి.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి..
కామారెడ్డి పట్టణంలోని 34వ వార్డు బీజేపీ అభ్యర్థిని ఆకుల సుజిత ఎంటెక్‌ వరకు చదివింది. యునైటెడ్‌ స్టేట్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తుంది. నెలకు భారీగానే వేతనం కూడా ఉంటుంది. అయితే కామారెడ్డిలో ఉంటున్న తమ వార్డును అభివృద్ధి పరిచేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు ఇండియాకు వచ్చింది. ఇందుకోసం యూఎస్‌లో ఉద్యోగం వదులుకుంది. తన భర్త ఇక్కడే బిజినెస్‌ చేస్తుండడంతో ఇద్దరు కలిసి వార్డు అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరఫున సుజిత పోటీ చేస్తున్నారు. తమ వార్డులో ప్రధానంగా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని, తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా, బోర్లు నుంచి నీటిని సరఫరా చేయకపోవడంతో చలించిపోయి తాను వార్డులో ప్రజా ప్రతినిధిగా ఉంటేనే సమస్యలను పరిష్కారం చేయవచ్చని ఉద్దేశ్యంలో పోటీ చేస్తున్నానని తెలిపారు

ఎంబీఏ చదివి..
పట్టణంలోని 27వ వార్డుకు చెందిన ముదాం ప్రముఖ ఎంబీఏ చదివింది. చిన్ననాటి నుంచి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యనభ్యసించింది. మొదటి నుంచి చదువుల్లో టాపర్‌గా నిలిచింది. పేదరికం, వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రముఖ పట్టణంలో ముదాంగల్లికి చెందిన అడ్వకేట్‌ నవీన్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం బీజేఫీ తరఫున పోటీ చేస్తోంది. 27వ వార్డు బీసీ మహిళ రిజర్వు రావడంతో కాలనీవాసుల ప్రోత్సాహంతో ఎన్నికల బరిలో నిలిచింది.

ఉపాధ్యాయులకే శిక్షకురాలిగా..
పట్టణంలోని 32 వార్డుకు చెందిన కమటాల సరోజ ఉన్నత చదువులు చదివి ఈసారి పుర ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎంఏ, బీఈడీ చదివింది. భర్త ప్రముఖ పిల్లల వైద్యులు. ఇన్‌ఫాంట్‌ ఎడ్యూకేటర్‌గా గర్భిణులకు, మహిళలకు 20 ఏళ్లుగా అవగాహన కల్పిస్తోంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు శిక్షకురాలిగా కూడా ఉంటూ ఎలా చదవాలి, బోధనలు, స్కిల్‌ డెవలప్‌మెంట్స్, హెల్త్, అంశాలపై శిక్షణలు కూడా ఇస్తుంది. అలాగే సన్నిహిత మహిళా సొసైటీని ఏర్పాటు చేసి స్వయం ఉత్పత్తితో జ్యూట్‌ బ్యాగ్స్‌ తయారు చేస్తూ మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తోంది.

ఎంటెక్‌ చదివి..
పాత పట్టణంలోని 26వ వార్డులకు చెందిన పిప్పిరి శ్రావణి బీటెక్, ఎంటెక్‌ ఉన్నత చదువులు చదివింది. మొదటి సారిగా పోటీలోకి దిగింది. కామారెడ్డిలోని అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా కూడా విధులు నిర్వహించింది. హైటెక్‌ సిటీలో ఉద్యోగం కూడా చేసింది. ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేద్దామని మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది.   

>
మరిన్ని వార్తలు