ఉద్యోగుల చూపు బీజేపీ వైపు!

25 May, 2019 02:07 IST|Sakshi

పోస్టల్‌ ఓట్లు అత్యధికంగా బీజేపీకే 

17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 17,319 ఓట్లు 

6,196 ఓట్లు బీజేపీకే  

ఆ తర్వాత కాంగ్రెస్‌కు ఎక్కువ 

మూడో స్థానంలో టీఆర్‌ఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే అత్యధికంగా పోస్టల్‌ ఓట్లు లభించాయి. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థులకు లభించగా, మూడో స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వచ్చినట్లు కౌంటింగ్‌ లెక్కల్లో తేలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 17,319 మంది ఉద్యోగులు పోస్టల్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. వారిలో 6,196 మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారు. అంటే 35.77 శాత మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారు. ఇక 5,162 మంది ఉద్యోగులు (29.8 శాతం) కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోస్టల్‌ ఓట్లు వేయగా, 4,718 మంది ఉద్యోగులు (27.24 శాతం) టీఆర్‌ఎస్‌కు వేశారు.

మిగతా వారు ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో చాలా తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్‌ ఓట్లను ఉపయోగించుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు 55 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో 17,319 మంది మాత్రమే వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ లెక్కలు తేల్చింది.

మరిన్ని వార్తలు