‘టిక్‌ టాక్‌’తో హద్దు మీరొద్దోయ్‌  

6 Aug, 2019 11:20 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఇటీవల కాలంలో స్మార్ట్‌ ఫోన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా తీరొక్క రకాల వీడియోలు చేస్తూ..యువతీ యువకులు పరిధి దాటుతున్నారు. సరదాకు ఎప్పుడో ఒకటి రెండూ చేస్తే అంతా ఆనందిస్తారు. కానీ..దీనిని ఓ వ్యసనంలా మార్చుకుంటూ..గంటల కొద్దీ సమయాన్ని కేటాయిస్తుండడమే చిక్కులు తెస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే వారిలో కొందరు సైతం..టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బయట పడిన ఘటనలతో ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు అనే తేడా లేకుండా..అనేకమంది ఈ టిక్‌ టాక్‌ యాప్‌ మోజ్‌లో పడిపోయారు. వీడియోలు చిత్రీకరిస్తూ పోస్టు చేస్తున్నారు. వీటికి వచ్చే లైక్‌లు, కామెంట్లతో ఉత్సాహంతో వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలను పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి.

ఇటీవల కొందరు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో టిక్‌ టాక్‌లు చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు కూడా. ఉద్యోగాలే ఊడిన సందర్భాలున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్‌లో మునిగి తేలిన వారు తాజాగా టీక్‌టాక్‌లో మునిగి తేలుతున్నారు. వీటిని ఆనందం పొందేందుకు కొంత మేరకు ఉపయోగిస్తే ఫర్వాలేదు. కానీ ప్రస్తుతం మీతిమిరిన స్థాయిలో ఉపయోగిస్తుండడంతో ఇబ్బందులు తప్పవు. ఎక్కడ ఖాళీ సమయం దొరికితే అక్కడ టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ..కొందరు టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. 

అతిగా చేస్తే..అవస్థలే  
ఉద్యోగులతో పాటు గృహిణులు కూడా తామేం తక్కువ కాదంటూ ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కామెంట్లను ఎదుర్కొంటున్న సంఘటనలు సైతం ఉన్నాయి. టిక్‌టాక్‌లు వీక్షించిన వారు ఒక్కొక్క సారి చెడుగా సైతం కామెంట్లను పెడుతుండడంతో తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తమ భర్తలకు, కుటుంబ సభ్యులకు  తెలియకుండా టిక్‌టాక్‌లు చేయడం, ఆ తర్వాత అవి ఇంట్లో తెలిసిన తర్వాత మనస్పర్థలు, వివాదాలకు తెరలేపుతున్నాయి. సినిమా మాటలకు నృత్యాలు చేస్తూ వీడియోలు చేయడం, అవి కూడా వావి వరుసలు మరచి మరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కొద్ది మంది చేస్తున్న వీడియోలు కుటుంబాల్లో చిచ్చును సైతం పెడుతున్నాయి. టిక్‌ టాక్‌ వీడియోలు మితిమీరి చేయకపోవడం మంచింది. చేసే వీడియోలు పద్ధతిగా చేయాలి. ఉద్యోగాల విధులను సైతం పక్కన పెట్టి టిక్‌ టాక్‌ చేయడం మానుకోవాలి. టిక్‌ టాక్‌ యాప్‌ను ఖాళీ సమయాల్లో ఉపయోగించడం, అది పరిమితి విధించుకోవడం క్షేమకరమని పెద్దలు, విశ్లేషకులు సూచిస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు