విభజన సమస్యలపై పోరుబాట

5 Nov, 2014 01:50 IST|Sakshi
విభజన సమస్యలపై పోరుబాట

తెలంగాణ ఉద్యోగ సంఘాల నిర్ణయం
18 ఎఫ్ రద్దు చేసే వరకు పోరాటం
ఈనెల మూడో వారంలో చలో ఢిల్లీ
గ్రూపు-1 అధికారుల సంఘం రౌండ్‌టేబుల్ భేటీలో తీర్మానం
నేడు సీఎంను కలవనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ

సాక్షి, హైద రాబాద్: ఉద్యోగుల విభజన సమస్యలపై పోరాట పంథానే కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా చర్యలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణలో మంజూరైన పోస్టుల కంటే ఉద్యోగులు తక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను నియమించేలా విభజన మార్గదర్శకాల్లో పొందుపరిచిన 18 ఎఫ్ నిబంధనను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు విభజన సమస్యలపై లోతుగా చర్చించారు.  స్థానికత ఆధారంగానే విభజన జరిగేలా మార్గదర్శకాల్లో మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ విభజన సమస్యలను బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల మూడో వారంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్యలను ఎంపీల ద్వారా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఉద్యోగుల వివరాలను పూర్తిగా ఇవ్వని విభాగాధిపతులపై క్రిమినల్ చర్యలతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే ఏ మార్పులు అయినా చేస్తామని కేంద్రం చెప్పిందని, ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలని అన్నారు. కాని ఆ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రా ఉద్యోగులంతా తెలంగాణలోనే ఉండేలా దుర్బుద్ధిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. 9, 10వ షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థలకు చెందిన వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యంగా వినియోగిస్తోందని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి నిధులపై రెండు రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న జ్ఞానం కూడా లేకుండా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీ సచివాలయం ముందు ధర్నా చేస్తామన్నారు.

ఆంధ్రా విభాగాధిపతుల కింద పని చేసేందుకు ఒప్పుకునేది లేదని, ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పని చేసేలా మార్పులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్రమైన పోరాటం చే స్తామన్నారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ జోనల్, మల్టి జోనల్ ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు విధానపర నిర్ణయం తీసుకోవాలన్నారు.

అక్రమంగా వచ్చిన వారిని ఆంధ్రాకు పంపించాలని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ వారిని ఇక్కడకు తీసుకురావాలని అన్నారు. 18 ఎఫ్‌ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ ఉద్యోగం అనేది లేకుండాపోతుందని, ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఎన్‌జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, టీజీవో సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ విభాగం ఇన్‌చార్జి డెరైక్టర్ ఆలోక్, సీటీవో శశిధర్, ఆడిట్ ఆఫీసర్ ర మేష్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ శివాజీ, హరిత, నవనీతరావు, మణిపాల్‌రెడ్డి ప్రసంగించారు.

మరిన్ని వార్తలు