లేజీఎస్‌!

19 Feb, 2018 15:51 IST|Sakshi
సేద్యపు నీటి గుంత నిర్మాణ పనుల్లో కూలీలు 

నత్తనడకన ఈజీఎస్‌ పనులు

సక్రమంగా విడుదల కాని నిధులు

గ్రామాల్లో పురోగతి లేని పనులు

50 శాతం కూడా పూర్తికాని వైనం

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

రైతులు, లబ్ధిదారులకు ప్రయోజనం శూన్యం

రాయికోడ్‌(అందోల్‌): ఈజీఎస్‌ (ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్‌ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్‌ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. 

సేద్యపు నీటి గుంతలు..
జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో 
ముందుకు సాగడంలేదు. 

పూర్తికాని పశువుల పాకలు..
జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 

306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్‌ పిట్స్‌..
1,333 నాడెం కంపోస్టు పిట్స్‌ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

ఇంకుడు గుంతలు అంతంతే.. 
53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. 

పూర్తికాని డంపింగ్‌ యార్డులు..
జిల్లాకు 330 డంపింగ్‌ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్‌ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి.

పూర్తయిన కిచెన్‌ షెడ్లు 128 మాత్రమే.. 
ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్‌ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్‌ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. 

కొరవడిన పర్యవేక్షణ.. 
ఈజీఎస్‌ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్‌ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్‌ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా