‘ఉపాధి’పైసమ్మెట

6 Jul, 2015 03:00 IST|Sakshi

జోగిపేట : ఉపాధి హామీ పథకం కూలీలకు పస్తులే దిక్కవుతున్నాయి. ఈజీఎస్ సిబ్బంది సమ్మె బాట పట్టడమే ఇందుకు కారణం. ఏడాది పొడవునా పనులు చేయించే సిబ్బందే విధులను బహిష్కరించి సమ్మె చేయడంతో కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వారికి పనులు కల్పించే విషయమై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించినా పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడంలేదని తెలుస్తోంది. ఫలితంగా హరితహారం పథకానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 వర్షాకాలంలో కూలీలు గుంతలు తవ్వి మొక్కలు నాటే పనులు చేపట్టాల్సి ఉంటుంది. 20 రోజులుగా సిబ్బంది ధర్నా చేస్తుండటంతో తాము పనులు చేపడితే ఎవరు రికార్డు చేస్తారు? డబ్బులు వస్తాయా? పని దినాలు పరిగణనలోకి తీసుకుంటారా? అన్న విషయమై అనుమానాలను కూలీలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 వేల శ్రమ శక్తి సంఘాలుండగా, 7 లక్షల మంది కూలీలు ఈజీఎస్ పనులు చేపడుతున్నారు. 12.15 లక్షల మంది వివిధ రకాల కూలీ పనుల కోసం జాబ్‌కార్డులను పొందినవారున్నారు.

2015-16 సంవత్సరానికిగాను 1.20 కోట్ల పనిదినాలు చేపట్టేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జూలై  మాసం వరకు 83 లక్షల పనిదినాలను పూర్తి చేయాల్సి ఉండగా ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా 73 లక్షల పనిదినాలను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సీజన్‌లో కేవలం గుంతలు మాత్రమే తవ్వే పనులు చేపట్టాల్సి ఉండడంతో ఎంపీడీఓల జోక్యంతో జిల్లాలోని అక్కడక్కడ ఈజీఎస్ కూలీలతో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడా పనిచేయడంలేదనే చెప్పవచ్చు.

 ‘హరితహారా’నికి తప్పని తిప్పలు
 జిల్లా వ్యాప్తంగా హరితహారం కింద 1.50 కోట్ల వరకు మొక్కలను పెంచేందుకు ఈజీఎస్ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. అయితే నర్సరీల నిర్వహణ ఖర్చులు, కూలీల డబ్బులు చెల్లించాల్సి ఉంది. సమ్మె కారణంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు మొక్కలు ఇచ్చేందుకు అభ్యంతరం తెలుపుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే ఈజీఎస్ పథకం కింద ఎక్కువ పనులు చేపడతారు. గత సంవత్సరం 22వేల కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తి చేయగలిగారు. జిల్లాలోని కొంత మంది కూలీలు అక్కడక్కడా గుంతలు తీసే పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

అయితే వారు ఇప్పటి వరకు 10 నుంచి 12 లక్షల వరకు గుంతలు తీసినట్లు సమాచారం. ఒకవేళ ఈజీఎస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసినట్లయితే 80 లక్షల వరకు గుంతలు తీసే అవకాశం ఉండేదని ఈజీఎస్ సిబ్బంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా హరితహారం కార్యక్రమానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపి హరిత హరం పథకానికి పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
 
 ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం
 ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా కూలీలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. మండలాల్లో ఎంపీడీలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. పలు ప్రాంతాల్లో కూలీలు పనిచేస్తున్నట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాకున్నా కూలీలకు పనులను మాత్రం కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో గుంతలు తీసే పనులను చేపడుతున్నాం. కూలీలకు సంబంధించి కూలీ డబ్బులు బకాయిలు ఉన్నట్లు తన దృష్టిలో లేదన్నారు.
 - ఓజే మధు, ఇన్‌చార్జి పీడీ

మరిన్ని వార్తలు