సిరిసిల్లకు సంక్రాంతి శోభ

25 Dec, 2018 02:33 IST|Sakshi
సిరిసిల్లలో నిల్వ చేసిన తమిళనాడుకు పంపాల్సిన చీరలు

తమిళనాడులో పొంగల్‌కు చీరల ఎగుమతి 

మరమగ్గాలపై చీరలు, పంచెల ఉత్పత్తి 

నేత కార్మికులకు ఉపాధి

సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్‌ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ  ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. 

సిరిసిల్లకు పండుగ శోభ 
ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్‌ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.

నాణ్యమైన ఉత్పత్తులు
ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్‌ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్‌లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్‌ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది.  పాలిస్టర్‌ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్‌ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది.

పని బాగుంది 
మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్‌ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి.
– వెల్ది హరిప్రసాద్, ఆసామి 

బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది 
సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్‌ కంటే తమిళనాడు చీరలు నయమే. 
– మహేశుని ప్రసాద్, కార్మికుడు

మరిన్ని వార్తలు