అటవీ ఉత్పత్తులతో ఉపాధి

9 May, 2014 03:01 IST|Sakshi
అటవీ ఉత్పత్తులతో ఉపాధి

కడెం, న్యూస్‌లైన్ : అడవి ఉత్పత్తులు గిరిజనులకు ఉపాధినిస్తున్నాయి. ఇప్పపువ్వు, తప్సి బంక, ఇప్ప పరక, తేనె తదితర ఫలాలను గిరిజనులు సేకరించి ఉపాధి పొందుతున్నారు. కాని వాటికి సరైన గిట్టుబాటు ధర  లభించడం లేదు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌లో ఇప్పపువ్వు విరబూస్తుంది. పల్లె ప్రజలు, కూలీలు ఇప్పపువ్వును పెద్ద ఎత్తున సేకరిస్తారు. ప్రస్తుతం గత కొద్దిరోజులుగా మండలంలోని బూత్కూరు, గొడిసెర్యాల, కుర్రగూడెం, దోస్తునగర్, ధర్మాజీపేట, సింగాపూరు, కల్లెడ, మద్దిపడగ, గోండుగూడెం, డ్యాంగూడెం గ్రామాల ప్రజలు తెల్లవారంగనే గంపలతో అడవులకు వెళ్లి ఇప్పపువ్వు సేకరిస్తున్నారు.

 

ఇలా సేకరించిన పువ్వును కడెంలోని జీసీసీ(గిరిజన సహకార సంస్థ)లో విక్రయిస్తారు. ఇక్కడ ప్రతీ ఆదివారం అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పపువ్వుకు కిలోధర రు.10 ఉంది. ఇలా ఒక్కొక్కరు 10 నుంచి 25 కిలోల దాకా పువ్వు తెచ్చి ఇక్కడ విక్రయిస్తారు. వెంటనే వారికి డబ్బులు చేతికందుతాయి. ఇలా గిరిజనులు ఇప్పపువ్వుతో ఉపాధి పొందుతున్నారు.  

గిట్టుబాటు ధర  కరువు
గిరిజనులు, గిరిజనేతరులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. తెలతెల్లవారంగా అడవికి వెళ్లి పువ్వు సేకరిస్తే సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో పువ్వుకు కేవలం రు.10 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికీ ధరలు పెరిగాయి. ఇలాంటప్పుడు తామేలా బతికేదని గిరిజనులు వాపోతున్నారు.

పెద్ద ఎత్తున కొనుగోళ్లు
కడెంలోని జీసీసీ ద్వారా ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు.  ప్రస్తుతం జీసీసీకి ఎక్కువగా ఇప్పపువ్వు మాత్రమే వస్తుండటంతో దీన్నే కొంటున్నారు. ఇప్పటి వరకు 31 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతే డాది 440 క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ సారి 500 క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యం ఉంది. ఆ  దిశగా జీసీసీ సిబ్బంది కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు