ఉపాధి పనుల జోరు

4 Apr, 2019 16:35 IST|Sakshi
ఎక్లాస్‌పూర్‌లో నిర్మాణం చేపట్టిన పశువుల పాక

 రూ.2కోట్ల 30లక్షలతో  23 జీపీల్లో నర్సరీలు 

8వేల జాబ్‌కార్డులకు, 6 వేల మందికి ఉపాధి

సాక్షి,మక్తల్‌ :ఐదు రకాల ఫాంపాండ్స్‌ ఏర్పాటుకు ఉపాధి పథకం పనులను చేపడుతుంది. ఇందులో 20–20 సైజ్‌కు రూ.1లక్ష40వేలు, 9.5–9.5 రూ.82వేలు, 8 బై 8 రూ.71వేలు, 6 బై 6కు రూ.42 వేలు, 2 బై 2కు రూ.24 వేలు డబ్బులు వెచ్చిస్తారు. రైతులు తమ పొలాల్లో అతి తక్కువ భూమి ఒక అర గుంటలో ఈ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ నిర్మాణం పూర్తయితే దీని ద్వారా వర్షపు నీటిని నిలువ చేయవచ్చు. తద్వారా నీరు భూమిలో భాగా ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి.

అదే పనిగా వర్షం కురిస్తే నీటిని నిలువ చేసుకోవచ్చు. దీంతో పొలానికి ఈ నీటిని వినియోగించుకోవచ్చు. అదే విధంగా పొలాల్లో క్రిమిసంహారక మందులను వేసేందుకు ఈ నీటి ద్వారా మందులను కలిపి పిచికారీ చేసి చల్లవచ్చు. దీంతో పాటు పశువుల దప్పికను తీర్చేందుకు ఈ నీటిని తాపవచ్చు. 15–20 రోజుల వరకు వర్షం పడని సమయంలో ఈ నీటిని పొలాలకు మల్లించుకోవచ్చు. ఇన్ని ప్రయాజనాలు ఉన్న ఫాంపాండ్‌లను రైతులు తప్పనిసరి తమ పొలాల్లో నిర్మించుకునేటట్లు ఉపాధి పథకం ద్వారా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు.

ఉపాధి హామీ పథకం  ద్వారా చేపట్టే పనులు.. 
ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 8,390 జాబ్‌కార్డులు, 629 శ్రమశక్తి సంఘాలున్నాయి. ఇందులో ఈ ఏడాది 5 వేల నుంచి 6 వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఫాంపాండ్స్, ఫీడర్‌ చానల్స్, మ్యాజిక్‌ షోఫిట్స్, కామన్‌ షోఫిట్స్‌( ఇంకుడు గుంతలు), క్యాటిల్‌షెడ్స్‌(పశువుల పాకాలు), డంపింగ్‌యార్డుల నిర్మాణాలు, వైకుంఠధామాలు, గ్రామ కంఠాల్లో కంప చెట్ల తొలగింపు, చెట్లు నాటడం మొదలైన పనులు చేపడుతున్నారు.

ఇంటింటికి ఇంకుడుగుంత.. 
భూగర్భజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి అయితే గ్రామాల్లో, పట్టణాల్లో భూగర్భజలాలు బాగా వృద్ది చెంది బోర్లల్లో నీరు వస్తుందనేది ప్రభుత్వ లక్ష్యం. నీటి వినియోగం బాగా పెరిగిన దృష్ట్యా ఇంకుడు గుంతలు ఎంతో సత్పాలితాలు ఇస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ఈ ఏడాది నిర్మాణాలను చేపట్టింది. 

చేపల చెరువు..  
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చేపల చెరువుల నిర్మాణమొకటి. చేపల చెరువులకు రూ.96,500 కేటాయించింది. ఈ పనుల్లో సాముహిక చేపల చెరువు, వ్యక్తిగత చేపల చెరువుల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో రైతులు మత్స్యకారులు ముందుకు వస్తే నిర్మాణాలను ఉపాధి పథకం ద్వారా చేపడుతుంది. ఇందులో రైతుకు ఉన్న నీటి వనరుల ద్వారా ఈ చెరువులో నీటిని నింపుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చేపలతో ప్రయోజనం కలుగుతుంది.

3వేల మందికి ఉపాధి కల్పించాలి 
కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీకి 150 మందికి, మండలంలో 3వేల మందికి ఉపాధి కల్పించాలి. ఫాంపాండ్స్‌ నిర్మాణాలు ఎక్కువ చేపట్టాలన్నారు. దీంతో పాటు డంపింగ్‌యార్డులను గ్రామాల్లో చేపట్టి, మూడు సంవత్సరాలు ఉపాధి పథకం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను నియమించుకోని వారికి దినసరి కూలీ చెల్లించి చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. 
– రమేష్‌కుమార్, ఎంపీడీఓ, నర్వ      

మరిన్ని వార్తలు