ఎన్‌కౌంటర్‌తో జక్లేర్, గుడిగండ్లలో ఉలిక్కిపాటు

7 Dec, 2019 09:37 IST|Sakshi
జక్లేర్‌లో పోలీసుల పహారా

గుంపులు గుంపులుగా గుమిగూడిన గ్రామస్తులు 

పోలీసుల రాకతో నిశ్శబ్దం.. గంభీరం!

సాక్షి, నారాయణపేట: వారం రోజుల ముందు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టికుపోయిండ్రు తండ్రో.. మళ్లీ శుక్రవారం తెల్లవారుజామునే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చేతిలో సచ్చి శవమైతిరో బిడ్డో.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దిశను హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో దేశమంతా ప్రజలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా.. నిందితుల స్వగ్రామాలైన మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌లో ఒక్కసారిగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిశ్శబ్దం.. విచారంతో కూడిన గంభీరమైన వాతావరణం కనిపించింది. మృతిచెందిన ఆ నలుగురి ఇళ్ల దగ్గర కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురిని పట్టుకొని వెళ్లినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కుటుంబీకులు ఉన్నారు. ఆ నలుగురు చేసిన పాడుపనితో జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చెడ్డపేరు వచ్చిందని, ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం.. ఆడపిల్లలకు భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుండడంతో స్వాగతిస్తున్నామంటూ పలువురు బహిరంగంగానే హర్షం వ్యక్తపరిచారు. ఆ నలుగురు కుటుంబాల తల్లిదండ్రులు తప్ప ఇతరులు అయ్యో పాపం అన్న పాపానపోలేదు.

సెల్యూట్‌.. పోలీస్‌
నారాయణపేట: పశువైద్యురాలు ‘దిశ’ను అత్యంత అమానవీయంగా హతమార్చిన దుర్మార్గులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మృగాళ్లకు సరైన శిక్షే పడిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిందితుల స్వగ్రామాల్లోనూ ప్రజలు ఈ ఘటనను స్వాగతిస్తుండగా.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఒకింత ఆవేదనకు గురయ్యారు. నిందితులు మహ్మద్‌పాషా అలియాస్‌ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌కుమార్, చింతకుంట చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌ అయ్యారని శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తెలియడంతో మక్తల్‌ మండలంలోని జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో చర్చనీయాంశమైంది. టీవీలు, వాట్సప్‌లో ఈ వార్త రాగానే వారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆ నలుగురి కుటుంబీకులు రోదించసాగారు. మా కొడుకులతో ఒక్కసారైనా మాట్లాడకుండా.. చూడకుండా చంపేశారా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. 

గ్రామాలకు చేరుకున్న పోలీసులు 

గుడిగండ్లలో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పరిస్థితి..

నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావుతోపాటు పోలీస్‌ అధికారులు గుడిగండ్ల, జక్లేర్‌కు హుటాహుటిన చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దామరగిద్ద, మక్తల్, కృష్ణ, మాగనూర్, వనపర్తి, మరికల్, నారాయణపేటల నుంచి ప్రత్యేక వాహనాల్లో పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాల్లో భారీగా సిబ్బంది రావడంతో ఆయా గ్రామాల్లో జనం ఎక్కడికక్కడే చూస్తూ మిన్నంకుండిపోయారు. 

శవాల వద్దకు కుటుంబీకులు 
దిశ హత్యలో నిందితులైన జక్లేర్‌ మహ్మద్‌పాషా అలియాస్‌ ఆరీఫ్‌ తండ్రి హుస్సేన్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని షాద్‌నగర్‌కు తరలించారు. అలాగే గుడిగండ్లలోని నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యలను సైతం తీసుకెళ్లారు. 

పీనిగెలు తెచ్చి మా చేన్లో పూడ్చొద్దు 
మాకు ఉన్నదే రెండు ఎకరాల పొలం. పీనిగెలు మా పొలంలోనే పోతయి. అక్కడ తెచ్చి పూడుస్తామంటే ఊరుకోమంటూ గుడిగండ్ల గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పెద్దలతో మ్యాకల వెంకటమ్మ వాదనకు దిగింది.   మేం పంటలు ఎలా పండించుకోవాలి   చెప్పండి అంటూ వాపోయింది. ఊరూరికి  పీనిగెలు పెట్టేందుకు శ్మశాన వాటిక ఉంది. ఈ ఊర్లో మాత్రం లేదు. మా పొలంలోనే  పూడుస్తరు. గుంతలు తవ్వినా పూడ్చివేస్తానంటూ తేల్చిచెప్పింది. దీంతో గ్రామపెద్దలు ఆమెను సముదాయించి అక్కడ పూడ్చరు అని చెప్పడంతో శాంతించి వెళ్లిపోయింది. 

క్షణం.. క్షణం శివ ఇంటి వద్ద పరిస్థితి:

 వనపర్తి ఎస్పీ అపూర్వరావు 

  •      11.13 గంటలకు వనపర్తి ఎస్పీ అపూర్వరావు పోలీస్‌ బందోబస్తుతో గుడిగండ్ల గ్రామానికి చేరుకున్నారు. 
  •      11.20 గంటలకు నిందితుడు శివ ఇంటికి చేరుకొని వారి తల్లిదండ్రుల గురించా ఆరా. తండ్రి రాజప్ప గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారని తెలుసుకుని ఆయనను తీసుకెళ్లి పోలీస్‌ వాహనంలో కూర్చోబెట్టాలని పోలీసులకు సూచన. 
  •      11.25 గంటలకు గుడిగండ్ల ప్రధాన రహదారిపై చేరుకున్న ఎస్పీ. గ్రామంలో పరిస్థితిపై నిశిత దృష్టి. గ్రామంలోని పెద్దలు ఏమంటున్నారో డీఎస్పీ మధుసూదన్‌రావుతో వివరాల సేకరణ. 
  •      11.30 గంటలకు చెన్నకేశవులు తండ్రి కుర్మన్న, గ్రామ పంచాయతీ   దగ్గర ఉన్న రాజప్పను పోలీస్‌ వాహనంలో ఎక్కించి ముందుగా మరికల్‌ పోలీస్‌స్టేషన్‌ తరలింపు. 
  •      11.35 గంటలకు నిందితుడు నవీన్‌ ఇంటికి ఎస్పీ చేరుకొని తల్లి లక్ష్మికి ఓదార్పు. అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌కు తరలింపు. 
  •      11.40 గంటలకు గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు పర్యవేక్షించాలని డీఎస్పీ, సీఐలకు ఎస్పీ సూచన. అనంతరం మరికల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ. 

మాట్లాడాలని ఉండే.. 
నేను అయినా ఆడపిల్లనే కదా. తప్పు     చేసిన శివతోపాటు ఆ ముగ్గురిని పోలీసులు శిక్షించిన తీరు బాగానే ఉంది. కానీ, మా అమ్మానాన్న మణెమ్మ, రాజప్పలకు ఒక్కసారి మా తమ్ముడు జొల్లు శివతో మాట్లాడాలని ఆశ ఉండే. చూడండి.. గత వారం రోజులుగా తిండి తిప్పలు మాని అనారోగ్యం బారినపడ్డారు. మానసికంగానూ ఎంతగానో కుంగిపోయారు. ఇప్పుడు మా తల్లిదండ్రులను పట్టించుకునేదెవరు. మా తమ్ముడుని కనడమే వీరు చేసిన పాపం అయినట్టుంది. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు.
– రాజేంద్రమ్మ, శివ అక్క 

మంచి నిర్ణయం 
దిశను దారుణంగా హత్య చేసిన ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం మంచి నిర్ణయమే. చెడ్డపని చేస్తే ఇలాంటి చర్యలు ఉంటాయని యువతకు బాగా తెలిసివచ్చింది. 
– జక్కప్ప, గుడిగండ్ల, మక్తల్‌ మండలం 

ఇది గుణపాఠం.. 
ఆడపిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు చేస్తే చట్టరీత్యా కఠిన శిక్షలు పడుతాయనే దానికి ఇదే నిదర్శనం. దిశను కిరాతకంగా పెట్రోల్‌ పోసి తగులబెట్టిన సంఘటన స్థలంలోనే ఆ నలుగురిని తీసుకెళ్లి విచారిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం సబబే. చెడు ఆలోచనలు చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి. 
– వెంకటయ్యగౌడ్, జక్లేర్, మక్తల్‌ 

చెడ్డపేరు తెచ్చారు..
దిశపై అత్యాచారం చేసి హత మార్చిన మహ్మద్‌పాషా, నవీన్, శివ, చెన్నకేశవులు చేసిన పనికి జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చె డ్డపేరు వచ్చింది. తప్పించుకుపోయేందుకు ప్రయత్నించిన ఆ నలుగురిని పోలీసులు కాల్చిచంపడం స రైందే. ఇకపై యువత ఇలాంటి పనులకు దూరంగా ఉండేందుకు ఈ ఎన్‌కౌంటర్‌ గుణపాఠమైంది. 
– నర్సింహులు, సర్పంచ్, జక్లేర్, మక్తల్‌ 

మాకు ధైర్యం వచ్చింది 
నాకు ఇద్దరు ఆడపిల్లలు. హాస్టల్‌లో ఉండి చదువుతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారం, హత్య చేస్తే వారిని అంతే దారుణంగా పోలీసులు కాల్చి చంపుతారనే ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ద్వారా ధైర్యం వచ్చింది. ఇప్పుడైనా ఆడపిల్లలపై ఇలాంటి పాడుపనులకు పాల్పడవద్దని కోరుకుంటున్నా.   
 – లక్ష్మి, జక్లేర్, మక్తల్‌  

మరిన్ని వార్తలు