‘ఆన్‌లైన్‌’ అమ్మకాలకు ప్రోత్సాహం

28 Mar, 2020 04:50 IST|Sakshi

జొమాటో, అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌ల ద్వారా నిత్యావసరాల సరఫరాకు ఓకే

సూపర్‌మార్కెట్‌లు సైతం ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల కోసం జనం బహిరంగ మార్కెట్‌లకు గుంపులు గుంపులుగా రాకుండా నిరోధించే చర్యల్లో భాగంగా ‘ఆన్‌లైన్‌’అమ్మకాలను ప్రోత్సహించే లా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్న అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్‌ వంటి సేవలను వినియోగించుకుంటూ నిత్యావసరాలను సరఫరా చేసేందుకు అనుమతిచ్చింది. వీటితో పాటే రైతుబజార్లు, స్థానిక మార్కెట్‌లలో కొనుగోలుదారుల రద్దీని నియంత్రించేందుకు మొబైల్‌ రైతు బజార్‌లను వీలైనన్ని ఎక్కువగా అందు బాటులోకి తెచ్చే చర్యలు తీసుకుంటోంది. సూపర్‌మార్కెట్లు సైతం ‘ఆన్‌లైన్‌’ద్వారా సరుకు సరఫరా చేయా లని యాజమాన్యాలను ఆదేశించింది. ఆన్‌లైన్‌ సర్వీసులో కొనుగోలు చేసిన సరుకులను వినియోగదారులకు చేరవేసే వారికి పోలీసు శాఖ అనుమతించింది. నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతిచ్చింది.

ఈ సమయాల్లో జనం మార్కెట్‌ల లోకి ఎగబడుతున్నారు.అక్కడ సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా, అవగాహన లేమితో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దీంతో రైతుబజార్లలో సామాజిక దూరం పాటించేలా మొబైల్‌ రైతుబజార్లను ఏర్పాటు చేస్తూనే, చిన్నచిన్న కాలనీల్లో ఏర్పా టు చేసే వారాంతపు సంతలను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. చాలా చోట్ల ఇవి మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు 70 వరకు మొబైల్‌ రైతుబజార్లు 110 చోట్ల అమ్మకాలు చేయగా, వాటిని మరో 100కు పెంచారు. ఈ మార్కెట్‌లలో రైతులు, వ్యవసాయ కూలీలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు నిత్యావసరాలు, కూరగాయల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంత ర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిత్యావసర సరుకు రవాణా వాహనాలకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే సరుకు రవాణా వాహనాలను స్థానిక మార్కెట్లకు తరలించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు