బడుగుకు భరోసా

31 Dec, 2014 02:39 IST|Sakshi
బడుగుకు భరోసా

* ప్రభుత్వ స్థలాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు  
* ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష
* ఉత్తర్వులు వచ్చిన 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి
* 25 గజాలు మించితే రిజిస్ట్రేషన్ ధరలో ముందుగా 25 శాతం డీడీ రూపంలో చెల్లించాలి
* గత జూన్ 2 లోపు ఉన్న నివాసాలకే వర్తింపు, నివాస ధ్రువీకరణ తప్పనిసరి.. 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తికి కేసీఆర్ నిర్దేశం

సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాల(125 గజాల్లోపు)ను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు తాజాగా ఆదేశించారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించేందుకు మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. భూముల క్రమబద్ధీకరణపై ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్టవేయడం, ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండడం వంటి లక్ష్యాలను సాధించడమే క్రమబద్ధీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి తల దాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమిత భూములకు పట్టాలు లేకపోవడంతో వారు నిత్యం అవస్థలు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అలాంటి వారు నివాసముంటున్న స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశ వరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌మీనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్ జి.డి.అరుణ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరచాల్సిన మార్గదర్శకాలను అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.

ఇవీ మార్గదర్శకాలు..
* ఈ ఏడాది జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలి. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జతపరచాలి.
    

* పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఆదా య పరిమితిని రెండు లక్షలకు పెంచినందున, ఆలోపు ఆదాయమున్న వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలుగా గుర్తించాలి.

* దరఖాస్తు చేసుకోవడానికి 20 రోజుల గడవు ఇవ్వాలి. దరఖాస్తుతోపాటు భూమికి నిర్ణయించిన ధరలో 25 శాతాన్ని డీడీ రూపంలో చెల్లించాలి.
* ఆసుపత్రులు, విద్యా సంస్థలను కూడా వ్యాపార సంస్థలుగానే పరిగణించాలి.
* జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదులపై విచారణ తదితరాలను చేపట్టాలి.
* క్రమబద్ధీకరణను 90రోజుల్లో పూర్తి చేయాలి.
* ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించాలి. విచారణ సందర్భంలో ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో, ఎవరు నివాసముంటున్నారో గుర్తించి ఫొటోలను కూడా అధికారులు తీసుకోవాలి.
* రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి పదవీ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి.
* క్రమబద్ధీకరణ చేసిన తర్వాత ఆ కుటుంబంలోని మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలి.

భూముల వేలానికి ఓకే
జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వేలానికి సం బంధించి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న చిన్న బిట్లుగా ఉన్న భూమిని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్నందున అవి కబ్జాకు గురవుతున్నాయని, అలాంటి వాటిని వేలం వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో కలెక్టర్లు ప్రతిపాదించిన భూములను వేలం వేసేందుకు అనుమతించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేదని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని సీఎం ప్రస్తావించారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమన్నారు. నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో, వాటిని సక్రమంగా నిర్వహించే విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు