మెదక్ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం

11 Sep, 2014 23:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం గురువారం సాయంత్రంతో పరిసమాప్తమైంది. మైకులు మూగబోయాయి. శనివారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినింగ్‌తో ప్రచారం చేసినా, ప్రచారం ఏకపక్షంగానే సాగిందనే చెప్పాలి. కాగా రైతు రుణమాఫీ, అన్నదాతల ఆత్మహత్యలను అస్త్రంగా చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి హరీష్‌రావు వ్యూహాలు.. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆత్మరక్షణలో పడేశాయని వారు చెబుతున్నారు.

టీఆర్‌ఎస్ నూరు రోజుల పాలన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు , ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ ప్రభుత్వానికి పాస్ మార్కులు రాలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనకు రెఫరెండంగా మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికను భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

 సమస్యలు వదిలేసి.. సవాల్ విసిరి
 రైతు రుణమాఫీ, సొంతింటి కల సాకారం హామీలతో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఒకే ఒక సంతకంతో రైతు రుణాలను మాఫీ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. దీన్ని అస్త్రంగా చేసుకొని  ప్రజల్లోకి వెళ్లి, అధికార టీఆర్‌ఎస్ మీద ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత ధూషణలు అందుకున్నారు.

ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలాంటి నాయకులు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలు, బస్తీమే సవాల్ అంటూ తొడ చరిచి బరి గీశారు. ‘జగ్గారెడ్డి  గెలిస్తే హరీష్‌రావు రాజకీయ సన్యాసానికి సిద్ధమా?’ అంటూ సవాల్ వేశారు. సరిగ్గా ఇదే అదునుకోసం ఎదురుచూస్తున్న  హరీష్‌రావు అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు.  తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రైతు రుణమాఫీ, ఆత్మహత్యల అంశాల మీదకు వారిని వెళ్లనివ్వకుండా సవాల్, ప్రతి సవాల్ అంశాలకే వారిని ఫిక్స్ చేస్తూ.. మీ సవాల్‌కు నేను సిద్ధమే అంటూ తన దైనశైలిలో వ్యూహం రచించారు.

 ఈ సవాల్ స్వీకరణతో బీజేపీ కూటమి ఆత్మరక్షణలో పడి వాస్తవ అంశాలను ప్రజలకు వివరించడంలో విఫలమైందని పరిశీలకుల వాదన. వెంటనే  హరీష్‌రావు మరో అస్త్రాన్ని సంధిస్తూ... ‘సిద్ధిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నారని ఆరోపిస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారనే చెప్పాలి. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హరీష్ ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటూ, గతాన్ని తవ్వుతూ వర్తమానం మరిచిపోయి విలువైన ఎన్నికల సమయాన్ని వృథా చేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు