ముగిసిన ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు

10 Jun, 2014 04:17 IST|Sakshi
ముగిసిన ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు

 గోదావరిఖని : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధంగా పనిచేస్తున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర 8వ మహాసభలు సోమవారం జరిగిన ప్రతి నిధుల మహాసభతో ముగిశాయి. ఆదివారం భారీ ప్రదర్శనతోపాటు పోచమ్మ మైదానంలో బహిరంగ సభ నిర్వహిం చగా.. ఈ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య హాజరయ్యారు.

సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని రాజస్థాన్‌భవన్‌లో జరిగిన ప్రతినిధుల సభలో తెలంగాణ జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ మహాసభలో సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక వర్గం చైతన్యవంతమైన పాత్రను పోషించాలని, ఇందుకు ఇఫ్టూ నాయకత్వం వహించాలని అతిథులు సూచించారు.
 
సింగరేణిలో ఓసీపీల వల్ల విధ్వంసం జరుగుతోందని, యాంత్రీకరణ పేరుతో కార్మికుల సజనాత్మకతను దెబ్బతీస్తూ వారు అనారోగ్యాల బారిన పడేలా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని, దీనిని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. కొత్తగా భూగర్భ గనులు ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అతిథులు ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
 
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడి చంద్రన్న వర్గం, రాయల సుభాష్ వర్గంగా మారిన క్రమంలో చంద్రన్న వర్గానికి చెందిన నాయకత్వం గోదావరిఖనిలో మహాసభలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించింది. ఈ మహాసభలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కావడం గమనార్హం.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త కమిటీలను రూపొందించే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఈ వివరాలను మంగళవారం వెల్లడించనున్నారు.

మరిన్ని వార్తలు