ముగిసిన నామినేషన్ల పరిశీలన

28 Feb, 2015 00:42 IST|Sakshi

ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులవి  తిరస్కరణ
మార్చి 2న ఉపసంహరణ

 
నల్లగొండ :  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ స్థానానికి పోటీ చేసేందుకు మూడు జిల్లాల నుంచి 27మంది 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఎన్నికల నియమావళికి లోబడి నామినేషన్ల పరిశీలించిన పిదప 25మంది అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత సాధించాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల దష్ట్యా తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థిత్వాన్ని కనీసం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ బి.కుమార్ (వరంగల్) నామినేషన్ ముగ్గురు ఓటర్లు  మాత్రమే ప్రతిపాదించడంతో దానిని తిరస్కరించారు. అదే విధంగా ఎన్నికల మాన్యువల్ ఆర్టికల్ 173 (బీ) ప్రకారం పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయస్సు 30 ఏళ్లు ఉండాలి. కానీ ఎల్.చందులాల్ (వరంగల్) వయస్సు 27 ఏళ్లు మాత్రమే ఉండడంతో ఆ నామినేషన్‌ను తిరస్కరించారు.
 
నల్లగొండ జిల్లా నుంచే అధికం..


అర్హత సాధించిన నామినేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లానుంచే ఉన్నాయి. వీటిలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న వారిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), సూరం ప్రభాకర్‌రెడ్డి (వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి) నల్లగొండ జిల్లాకు చెందిన వారు. పల్లా రాజేశ్వరరెడ్డి, ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు. అయితే ఈ అభ్యర్థులు నామినేషన్ పత్రంలో పేర్కొన్న చిరునామా, ఓటర్లు ఉన్న ప్రాంతాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. తీన్మార్ మల్లన్న తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్, సూరం ప్రభాకర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ చిరునామా పేర్కొన్నారు. రామ్మోహన్‌రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్లెడ చిరునామా పేర్కొన్నారు.
 
మొత్తం దాఖలైన  నామినేషన్లు   - 27
ఎన్నికల్లో పోటీ కి  అర్హత సాధించినవి   - 25
 
 

మరిన్ని వార్తలు