స్వీయ పరీక్షా కేంద్రాలకు స్వస్తి

14 Feb, 2019 02:17 IST|Sakshi

గురుకులాల్లో సెల్ఫ్‌ సెంటర్ల రద్దుకు నిర్ణయం 

టెన్త్, ఇంటర్‌ పరీక్షలకు ఇతర సొసైటీల్లో పరీక్షా కేంద్రాలు  

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో స్వీయ పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇకపై ఒక గురుకుల సొసైటీ పరిధిలోని విద్యార్థులు అదే సొసైటీకి చెందిన ఎగ్జామ్‌ సెంటర్లో పరీక్షలు రాసే వీలుండదు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 603 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ఎస్సీ 232, ఎస్టీ 88, జనరల్‌ 35, బీసీ 142, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో 120 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సగానికి పైగా గురుకుల పాఠశాలలు గత రెండు, మూడేళ్ల క్రితమే ప్రారంభం కావడంతో అవి పదో తరగతికి మరో ఏడాదిలో అప్‌గ్రేడ్‌ కానున్నాయి. మరో 207 గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు నడుస్తుండగా వీటిలో 98 గురుకుల పాఠశాలలు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ కావడంతో ఇంటర్మీడియట్‌ కోర్సులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఈ 207 గురుకుల పాఠశాలలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో చాలావరకు అదే సొసైటీకి చెందిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ పరీక్ష కేంద్రాల దూరం తదితర అంశాలను పరిగణిస్తూ వారికి ఆయా కేంద్రాలను నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ పరీక్షా కేంద్రాలు (సెల్ఫ్‌ సెంటర్లు) రద్దు చేయాలని పరీక్షల విభాగం సూచన చేసింది. దీంతో సెల్ఫ్‌ సెంటర్లు లేకుండా పరీక్షల నిర్వహణకు సొసైటీలు చర్యలు చేపట్టాయి. ఏటా ఎంత మంది విద్యార్థులు స్వీయ సొసైటీ పరిధిలో పరీక్షలు రాస్తున్నారనే గణాంకాలు తిరగేస్తున్నారు. సంఖ్య అధికంగా ఉంటే భారీ మార్పులు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

ఫలితాలపై ప్రభావముంటుందా? 
పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి. ప్రతి సొసైటీ ఫలితాలు రాష్ట్ర ఫలితాల సగటు కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. గురుకుల విద్యార్థులు ఎక్కువగా అదే సొసైటీకి చెందిన సెంటర్లలో పరీక్షలు రాయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సెల్ఫ్‌ సెంటర్ల రద్దు చేపడితే ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందనే భావన గురుకుల ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.   

మరిన్ని వార్తలు