ఇదీ..అడవేనా?

23 Aug, 2019 11:46 IST|Sakshi

జిల్లాలో క్షీణించింది 54శాతం

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ముసుగుతో కప్పేస్తున్న అటవీ శాఖాధికారులు

గొడ్డలి వేటుకు వేల హెక్టార్లలో చెట్లు మాయం

గజ్వేల్‌ స్ఫూర్తి ఆదిలాబాద్‌కు అవసరమే..

నేడు పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ రాక

ఇది ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రానికి కూతవేటు 9కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతం.. ఆదిలాబాద్‌ రేంజ్, సెక్షన్‌ పరిధిలోని యాపల్‌గూడ బీట్‌లోకి వచ్చే అడవి. సుమారు 20హెక్టార్ల విస్తీర్ణంలో ఒక చెట్టు చేమ కూడా కనిపించదు. అటవీ మాయంపై ఆ శాఖాధికారులను అడిగితే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ అని టకీమని చెబుతారు. గొడ్డలి వేటుకు కూడా ఇక్కడ చెట్లు మాయమైపోయాయి. జిల్లాలోని అడవిలో ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో..

సాక్షి,ఆదిలాబాద్‌ : జిల్లాలో ఉన్న అటవీ విస్తీర్ణంలో ప్రస్తుతం సగం కంటే ఎక్కువే క్షీణించిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా హరితహారం ద్వారా పచ్చదనం 24శాతం నుంచి 33 శాతానికి పెంచాలని చెప్పడం ఈ అడవుల జిల్లాకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే 54శాతం క్షీణించిపోయిన అటవీని ఇప్పుడు పెంచాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది. జిల్లాలో అటవీశాఖ పరంగా మూడు డివిజన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌ ఉన్నాయి. వీటిలో తొమ్మిది రేంజ్‌లు ఆదిలాబాద్, బేల, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బీర్సాయిపేట, సిరిచెల్మ వస్తాయి. వీటి పరిధిలో 49 సెక్షన్లు, 171 బీట్‌లు ఉన్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ డివిజన్‌లోనే అటవీ పెద్ద మొత్తంలో మాయమైంది.

ఆ తర్వాత ఇచ్చోడ, ఉట్నూర్‌ డివిజన్లలో ఈ పరిస్థితి ఉంది. అటవీ క్షీణించేందుకు అధికారులు చెప్పే ప్రధాన సాకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌. అయితే ఆదిలాబాద్‌ డివిజన్‌లోనే ఎక్కువ శాతం అటవీ క్షీణించిందంటే దానికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ముసుగు వేయలేని పరిస్థితి. ఎం దుకంటే గిరిజనులు అత్యధికంగా నివసించేది ఇచ్చోడ, ఉట్నూర్‌ డివిజన్లలోనే. ఈ లెక్కన అటవీని మాయం చేసింది ఎవరనేది చెప్పకనే స్పష్టమవుతుంది. స్మగ్లర్ల ధాటికి జిల్లాలో అటవీ కాకవికలమైందనేది అటవీ అధికారులు ఒప్పుకోకపోయినా ఇది బహిరంగ రహస్యమే.

గజ్వేల్‌ స్ఫూర్తి నింపేనా..
బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లు, మంత్రులకు సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని సింగారిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను చూపించారు. గజ్వేల్‌ స్ఫూర్తిగా అటవీ పునరుద్ధరణకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు అడవుల జిల్లా అని చెప్పుకొనబడే ఆదిలాబాద్‌ ఈ స్ఫూర్తిని అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జిల్లాలో 54 శాతం అటవీ క్షీణించిపోయింది. రానున్న రోజుల్లో ఇది అడవేనా.. ఎడారా అని చెప్పుకునే రోజులు వచ్చే పరి స్థితి లేకపోలేదు. అటవీ పునరుద్ధరణకు చర్యలు చేపడితేనే మళ్లీ దట్టమైన అడవుల జిల్లా అని చెప్పుకోవచ్చు. లేనిపక్షంలో మైదానంగా ఉండే అడవుల జిల్లా అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

సహజమైన పద్దతిలో..
యాపల్‌గూడలో ఇప్పుడు సహజమైన పద్దతిలో చెట్లు పెంచేందుకు అధికారులు ముందుకు కదులుతున్నారు. గజ్వేల్‌ స్ఫూర్తితో ఇది చేపడుతున్నారు. అయితే ఈ స్ఫూర్తి కొద్దిరోజులకే పరిమితం కాకుండా సహజమైన అటవీ తయారయ్యే వరకూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. యాపల్‌గూడ ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అటవీ ఉండేదని అధికారులే చెబుతారు. ఇప్పుడు సూక్ష్మదర్శిని వెతికినా చెట్లు కనబడవు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో ఇలా అటవీ క్షీణించిన 54 శాతంలో తిరిగి సహజమైన పద్దతిలో చెట్లను పెంచేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అటవీలో మొక్కలు నాటేందుకు మూడు పద్దతులను ఎంచుకున్నారు. ట్రెంచ్‌ ప్లాంటింగ్‌లో భాగంగా అటవీకి శివారులో గతంలో కందకాలు తవ్వడం జరిగింది. ఆ కందకాల చుట్టూ మొక్కలను పెంచడమే ట్రెంచ్‌ ప్లాంటింగ్‌. బ్లాక్‌ ప్లాంటేషన్‌లో భాగంగా.. ఇదివరకు అటవీగా ఉండి ప్రస్తుతం మైదాన ప్రాంతంగా మారిన అటవీ స్థలంలో విరివిగా మొక్కలు నాటడమే బ్లాక్‌ ప్లాంటేషన్‌. మూడవది హరితవనాలను పెంచడం.. ఇప్పుడు ఆదిలాబాద్‌ శివారులో మావల పార్కులో విరివిగా మొక్కలు నాటడం ద్వారా హరితవనం పెంచేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. అలాంటివే పలుచోట్ల చేపట్టారు. 

పీసీసీఎఫ్‌ రాక..
ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రానికి రానున్నారు. హరితహారంలో భాగంగా ఆదిలాబాద్‌ శివారులోని మావల హరితవనంలో ఏర్పాటు చేసిన సాహస క్రీడలకు సంబంధించి సైకిల్‌రోప్, ఇతరత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. కాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వస్తున్న పీసీసీఎఫ్‌ జిల్లా అటవీ పరిస్థితులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.                     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా