ముగిసిన జంతుగణన

13 May, 2019 02:39 IST|Sakshi
చెలిమెలను పరిశీలిస్తున్న అధికారులు

చెలమలు, వాగుల వద్ద ఉచ్చుల తొలగింపు 

ఫారెస్టు అధికారులు, ఎన్జీవోల సంయుక్త కృషి 

11న ప్రారంభమై.12న ముగిసిన జంతుగణన    

సాక్షి, హైదరాబాద్‌: అడవుల్లో జంతువుల పరిరక్షణార్థం నిర్వహించిన 2 రోజుల జంతు గణన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ముఖ్య పరిరక్షక అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు శని, ఆదివారాల్లో ఈ సర్వేలో పాల్గొన్నారు. జంతువుల కదలికలు, అడవుల్లో నీటి చెలమల గుర్తింపు, అక్కడికి వచ్చే జంతువుల కదలికల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా నీటి చెలమలు, వాగులు, నీటి వనరుల వద్ద వేటగాళ్లు బిగించిన ఉచ్చులను గుర్తించి తొలగించారు.

మొత్తం 104 మంది వలంటీర్లు రాష్ట్రంలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్, ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్‌ సాంక్చురీలో 43 బృందాలుగా విడిపోయి ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 241 నీటి వనరుల వద్ద ఉదయం, సాయంత్రం, రాత్రి పొద్దుపోయిన తరువాత సందర్శనలు జరిపారు.

అడవిలో సాయంగా ఉండేలా ప్రతీ బృందానికి స్థానిక అటవీశాఖ నుంచి ఒక గైడ్‌ను ఏర్పాటు చేశారు. అడవిలో వారి పర్యటన, రవాణా, వసతి తదితరాలకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్జీవో, వలంటీర్ల కోసం శనివారం ఉదయం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌ నుంచి 3 బస్సులు కూడా అటవీశాఖ ఏర్పాటు చేసింది. సర్వేలో భాగంగా చెలమలు, వాగుల వద్ద లభించిన జంతువుల కాలిముద్రల వివరాలు సేకరించారు. ఈ సర్వేలో భాగంగా కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఫాంథర్‌ (చిరుతను పోలిన పులి), అడవి కుక్కలు, ఎలుగు, సాంబార్‌ (జింకలో రకం), నీల్‌గాయ్, చౌసింగాలను నేరుగా చూసినట్లు అధికారులు తెలిపారు.

ఏటూరు నాగారంలో ఇండియన్‌ బైసన్, నీల్‌గాయ్, పలు రకాల పాములు, పక్షులు చూసినట్లు వివరించారు. ప్రస్తుత సర్వే వివరాలకు అటవీశాఖ అదనపు సమాచారాన్ని కూడా జోడించి జంతు గణన పూర్తి చేయనుంది. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ, వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) డెక్కన్‌ బర్డర్స్, హిటికోస్, ఎఫ్‌డబ్ల్యూపీఎస్‌ తదితర సంస్థల వాలం టీర్లు సర్వేలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, అటవీశాఖ సిబ్బందిని ఫారెస్ట్‌ ఫోర్స్‌ హెడ్‌ పీకే ఝా అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా