ముగిసిన చేప ప్రసాద పంపిణీ

10 Jun, 2019 01:52 IST|Sakshi
ఆదివారం చేప ప్రసాదం కోసం ఎగ్జిబిషన్‌ మైదానంలో కిక్కిరిసిన జనం

హైదరాబాద్‌: మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రెండో రోజు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆస్తమా రోగులతో ఎగ్జిబిషన్‌ మైదానం కిక్కిరిసిపోయింది. రెండవ రోజు కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా తిరిగి వెళ్తున్నారన్నారు.

చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కల్పించిన మౌలిక సదుపాయాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం పలు స్వచ్చంద సంస్థలు చేసిన సేవలు అభినందనీయమని, ఇటువంటి సామాజిక సేవలను భవిష్యత్తులో కొనసాగించాలని సూచించారు. రెండు రోజుల పాటు 87 వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిని హరినాథ్‌ గౌడ్, మత్స్య శాఖ కమిషనర్‌ సువర్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు