దేవుడికి రాబడి!

19 Oct, 2019 11:01 IST|Sakshi
దేవాదాయ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డు పాతిన అసిస్టెంట్‌ కమిషనర్‌ సంధ్యారాణి

సాక్షి, రంగారెడ్డి : దేవాదాయ శాఖ భూములను అధికారులు కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. దశాబ్దాలుగా ఇతరుల చేతుల్లో ఉన్న భూములను జిల్లా ఎండోమెంట్‌శాఖ స్వాధీనం చేసు కుంటోంది. కౌలు రూపంలో వచ్చిన డబ్బులను ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలతో పాటు పలు అభివృద్ధి నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యాలు డబ్బులు చెల్లిస్తున్నా.. దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ సాధ్యపడటం లేదు.

కొన్ని దేవాలయాలకు ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నా ఆదాయం అంతంతే లభిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో పేరుకు 15,997 ఎకరాల భూమి ఉన్నా ఆశించిన స్థాయిలో రాబడి లేదు. వందల మంది రైతులు దేవుడి మాన్యాలను సాగుచేసుకుంటున్నా కౌలు చెల్లించడం లేదని సంబంధిత అధికారులు గుర్తించారు. ఏళ్లుగా  భూములను సాగు చేసుకోవడండం, పోటీ లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. దీనికి స్వస్తి పలకాలని యంత్రాంగం నడుం బిగించింది.  

ఇప్పటి వరకు రూ.20 లక్షలు 
దేవాలయాల వారీగా భూమి లెక్కలు సేకరించిన దేవాదాయ శాఖ అధికారులు.. మొదటగా పొలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సదరు భూముల్లో హద్దురాళ్లు, దేవాదాయశాఖ పేరిట బోర్డులు పాతుతున్నారు. ఇప్పటివరకు 2,615 ఎకరాల భూమిని తమ శాఖ ఆధీనంలోకి తెచ్చారు. ఈ భూముల కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. ఈఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టగా.. ఇప్పటివరకు 15 చోట్ల దాదాపు 500 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి కౌలు కోసం వేలం వేశారు.

వేలం పాటలో ఒకసారి దక్కించుకుంటే రెండేళ్లపాటు సాగుచేసుకోవచ్చు. అయితే, కౌలు చెల్లించాకే పంటలు సాగుచేసుకోవాలని నిబంధన విధించారు. దీంతో వేలంలో భూములు దక్కించుకున్న రైతులు ముందస్తుగా కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు కౌలు రూపంలో ఆయా దేవాలయాలకు సుమారు రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. త్వరలో మిగిలిన భూముల కౌలు వేలానికి అధికారులు నోటిఫికేషన్‌  విడుదల చేయనున్నారు.

మంచి స్పందన వస్తోంది..  
దేవాదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఆయా ఆలయాలు ఆర్థికంగా పరిపుష్టి అవుతున్నాయి. ఫలితంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వీలుగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇప్పటివరకు 500 ఎకరాలను కౌలు కోసం వేలం వేశాం. ఆలయాలకు చెందిన ప్రతి ఎకరాన్ని స్వాధీనం చేసుకుంటాం.  
– సంధ్యారాణి, అసిస్టెంట్‌ కమిషనర్, జిల్లా దేవాదాయ శాఖ  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా