ఆలయాలు ఆదాయ కేంద్రాలా?

26 Dec, 2016 02:15 IST|Sakshi
ఆలయాలు ఆదాయ కేంద్రాలా?

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
హైదరాబాద్‌: ‘‘హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖకు ఆదాయ కేంద్రాలా? భక్తులు నిధులు, కానుకలు ఇచ్చేది అధికారులు, ఉద్యోగులకు వేతనాలిచ్చి, ఏసీ కార్లలో తిప్పడానికా?’’ అని విశాఖ శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర స్వామి ప్రశ్నించారు. భక్తులు సమర్పించిన కానుకలు, నిధులను కాపాడాల్సిన అవసరం ఉందని, దేవాదాయ శాఖ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌ చందానగర్‌లోని విశాఖ శారదాపీఠ పాలిత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో విరాట్‌ విశ్వశాంతి మహాయజ్ఞం ముగింపు వేడుకల్లో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇతర మతాల ప్రార్థనాలయాల్లోకి వెళ్లడానికి దమ్ములేని ప్రభుత్వాలు హిందూ దేవాలయాల్లో మాత్రం భక్తులు సమర్పించిన నిధులను భక్షిస్తున్నాయన్నారు. రాష్ట్రం, దేశం హితం కోసం ప్రభుత్వాలు యాగాలు తలపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నిధులతో అద్భుత యాగం చేశారని కొనియాడారు.

ముగిసిన మహాయజ్ఞం వేడుకలు
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించిన విరాట్‌ విశ్వశాంతి మహాయజ్ఞం వేడుకలు ఆదివారం వైభవంగా ముగిసాయి. ఉదయం 7 గంటల నుంచి సంకల్పం, విశ్వక్సేన పూజ, నవగ్రహ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీనారాయణ, మహాసుదర్శన, ఛండీ, చతుషష్టి యోగిని దేవతా విరాట్‌ వేంకటేశ్వర మండపారాధన హోమాలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి పూర్ణాహుతి, హరిహరులు కల్యాణోత్సవం నిర్వహించారు. కాగా, ఈ సందర్భంగా స్వామీజీ.. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా, బాలస్వామిగా కిరణ్‌కుమార్‌ శర్మ పేరును ప్రకటించారు.

మరిన్ని వార్తలు