పుస్తకం..ప్రపంచాన్ని మార్చే ఆయుధం

19 Jan, 2018 03:03 IST|Sakshi
బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి 

మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్య

కనులపండువగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : సమాజ స్వరూపం మారడానికి అక్షరమే పునాదని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎన్‌టీఆర్‌ స్టేడియంలోని భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కనులపండువగా ప్రారంభమైంది. జగదీశ్వర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అక్షరం పుట్టిన తర్వాతే అనూహ్యమైన మార్పులు వచ్చాయని, పుస్తకమే ప్రపంచ గమనాన్ని మార్చే ఆయుధమని ఈ సందర్భంగా జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని ఏ వైరస్‌ అయినా చిటికెలో మాయం చేస్తుందని, పుస్తకంలోని అక్షరాలను ఏ వైరస్‌ కూడా అడ్డుకోలేదన్నారు. పుస్తకం లేని జీవితానికి పరిపూర్ణత రాదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  

పుస్తకంతోనే ప్రపంచంలో గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పుస్తకం మంచి స్నేహితుడని, పుస్తక పఠనం మనిషిని తలెత్తుకొని బతికేలా చేస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. పుస్తకం మనిషికి విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తుందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 వరకు జరిగే బుక్‌ ఫెయిర్‌ విజయవంతం కావాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి ఆకాంక్షించారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు