డిగ్రీ, ఇంజినీరింగ్‌ అనుసంధానం..!

9 Apr, 2018 13:06 IST|Sakshi

ఎంసెట్, దోస్త్‌ ప్రవేశాలకు లింక్‌

డిగ్రీ సీట్లు మిగిలిపోకుండా చర్యలు

ఇంజినీరింగ్‌లో సీటొస్తే డిగ్రీలో ఖాళీ

శాతవాహనలో  22,986 వేల సీట్లు మిగులు

అనుసంధానంతో సీట్ల మిగులుకు అడ్డుకట్ట

లాభమంటున్న విద్యార్థులు, యాజమాన్యాలు

శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఎంసెట్, దోస్త్‌ ప్రవేశాలకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు డిగ్రీలో కూడా చేరేందుకు సిద్ధపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే చాలామంది విద్యార్థులకు రెండింటిలో సీట్లు రావడంతో ఇంజినీరింగ్‌తోపాటు ఇతర కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ ప్రవేశాలనురద్దు చేసుకునే అవకాశం లేకపోవడంతో డిగ్రీ కళాశాలల్లో సీట్ల మిగులుకు కారణమవుతోంది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల గందరగోళానికి తెరతీస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు వృథాగా పోకుండా ఉండడానికి ఎంసెట్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయాలని ప్రవేశాలకు సంబంధించిన అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఈ విషయమై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల(దోస్త్‌) కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం సమావేశమైనట్లు సమాచారం. డిగ్రీ కోర్సుల్లో సీట్లు మిగిలిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాల గురించి సంబంధిత అధికార వర్గాలు చర్యలు చేపడుతున్నారు. ఇదే జరిగితే కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా పలు కళాశాలల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. 

ఇంజినీరింగ్‌లో వస్తే డిగ్రీలో ఖాళీ..
శాతవాహనలో గతేడాది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్‌కు వెళ్లడంతో దాదాపు 2 వేల వరకు సీట్లు డిగ్రీలో వృథాగా మిగిలిపోయాయని సమాచారం. విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాక కూడా డిగ్రీ కోర్సుల్లో వారి ప్రవేశాలు రద్దుచేసుకోకపోవడంతో సీట్ల విషయంలో గందరగోళం తలెత్తేది. కానీ ప్రభుత్వం అనుసంధానం నిర్ణయం వల్ల టాప్‌ కళాశాలల్లో సీట్ల వృథాను అరికట్టవచ్చని వివిధ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలనే ఆసక్తితో ఉంటే ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేయడం ద్వారా వారు ఇంజినీరింగ్‌లో చేరగానే డిగ్రీలో అతడికి వచ్చిన సీటు ఖాళీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో టాప్‌ కళాశాలల్లో సీట్లు మిగలకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇదేకాకుండా డిగ్రీలో సీటు వచ్చిన విద్యార్థులు వారి సీట్లను కన్‌ఫార్మ్‌ చేసుకునేటప్పుడు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే నిబంధన విధించనున్నారు. ఇది ఓసీలకు రూ.వెయ్యి,  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500 ఉండనున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని విద్యార్థి కళాశాలలో చేరాక లేదా ఆ సీటును వదులుకున్నాక ఇచ్చేలా నిబంధన విధించనున్నట్లు తెలిసింది. గతేడాది శాతవాహన వ్యాప్తంగా దాదాపు 2 వేలకుపైగా విద్యార్థులు బీటెక్‌ వైపునకు వెళ్లడంతో డిగ్రీలో మిగిలిపోయాయి.

22,986 సీట్ల మిగులు...
2017–18 విద్యాసంవత్సరం శాతవాహన యూనివర్సిటీ ప్రవేశాలను పరిశీలిస్తే యూనివర్సిటీ వ్యాప్తంగా 46,310 సీట్లకు 22,986 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో బీఏలో 3,950 సీట్లకు 2,489 సీట్లు, బీబీఏలో 660 సీట్లకు 444, బీసీఏలో 60కి 60, బీకాంలో 20,280కి 9,244, బీఎస్సీలో 21,360 సీట్లకు10749 సీట్లు మిగిలిపోయాయి. 49.64 శాతం సీట్లు మిగులు శాతం నమోదైంది.  దీనిలో దాదాపు రెండు వేలకు పైగా సీట్లు విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ రెండింటికీ దరఖాస్తు చేసుకుని ఇంజినీరింగ్‌ వైపు వెళ్లిపోవడంతో డిగ్రీల్లో ప్రముఖ కళాశాలల్లో సీట్ల మిగులుకు దారితీసింది. ఈ సారి అనుసంధాన ప్రక్రియ అందుబాటులోకి వస్తే ఇలాంటి పరిస్థితులుండవని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అనుసంధానం మంచిదే...
ప్రభుత్వం చేయనున్న ప్రవేశాల అనుసంధాన ప్రక్రియ వల్ల డిగ్రీచేసేవాళ్ళకు లాభం చేకూరుతొంది. గతంలో ఇంజినీరింగ్, డిగ్రీ రెండు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండింటిలో సీటు వస్తే ఆసక్తి గల అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో చేరినా డిగ్రీలో సీటు రద్దయ్యేదికాదు. దీనితో సీట్లు వృథా అయిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితిఉండదు. విద్యార్థులకు, యాజమాన్యాలకు అందరికీ మంచిదే.
– పి.వేణు, తెలంగాణ ప్రవేట్‌ డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు